ఇటీవల రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆయనపై ఎంపీగా కూడా అనర్హత వేటు పడింది. ఈ విషయాలపై రాహుల్ గాంధీ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం చూశాం. అయితే ఆ సందర్భంలో వీర సావర్కర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున రాజకీయ చర్చకు తెర లేపాయి.
వీర సావర్కర్.. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో ఈ పేరు బాగా వినిపిస్తోంది. రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ తో ఇప్పుడు ఆ పేరు వైరల్ కావడమే కాదు.. పెద్దఎత్తున చర్చకు కూడా దారి తీస్తోంది. రెండేళ్ల జైలుశిక్ష పడిన సమయంలో రాహుల్ గాంధీ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “క్షమాపణ చెప్పడానికి నా పేరు సావర్కర్ కాదు..” ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వేడిని రాజేశాయి. అయితే ఇవి కాంగ్రెస్ పార్టీకి కూడా చేటు చేసేలా ఉన్నాయి. ఎందుకంటే ఈ వ్యాఖ్యలతో పొత్తులో ఉన్న ఉద్ధవ్ ఠాక్రే.. కాంగ్రెస్ పై గుర్రుగా ఉన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన డిన్నర్ మీటింగ్ కి కూడా తాము దూరంగా ఉంటున్నట్లు ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు.
వినాయక్ దామోదర్ సావర్కర్ తన 28వ ఏట జైలుపాలయ్యారు. నాసిక్ కలెక్టర్ హత్యకు ప్రోత్సహించారంటూ ఒక కేసు, ఇండియన్ పీనల్ కోడ్ 121-ఏ ప్రకారం మరో కేసుకు సంబంధించి మొత్తం 50 ఏళ్లు జైలుశిక్షను విధించారు. రాజకీయ ఖైదీగా సావర్కర్ ను బ్రిటిష్ ప్రభుత్వం భావించింది. జులై 4, 1911లో అండమాన్ జైలుకు తరలించారు. అక్కడ ఆయన 1911, 1913, 1917లో బ్రిటిష్ ప్రభుత్వానికి తన శిక్ష విషయంలో లేఖలు రాశారు. జైలులో ఉండగానే సావర్కర్ ‘ఎసెన్షియల్స్ ఆఫ్ హిందుత్వ’ అనే పుస్తకాన్ని కూడా రాశారు. 1924లో విడుదల చేసినా ఆయన్ను రత్నగిరి జిల్లాకే పరిమితం చేశారు. సావర్కర్ ను ఒక బంగ్లాలోనే ఉంచారు. తర్వాత హిందూ మహాసభకు అధ్యక్షుడు కూడా అయ్యారు.
అయితే ఆయన అండమాన్ జైలులో ఉన్న సమయంలో బ్రిటిష్ వారికి సావర్కర్ క్షమాపణలు చెప్పారని. బ్రిటిష్ వారికి ఎన్నో లేఖలు రాశారంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానిస్తూనే ఉన్నారు. అయితే ఆ లేఖల విషయంలో పలు వాదనలు ఉన్నాయి. గాంధీ చెబితేనే సావర్కర్ ఆ లేఖ రాశారంటూ ఓ సందర్భంలో రాజ్ నాథ్ సింగ్ అన్నారు. సావర్కర్ పిటిషన్ కు గాంధీ మద్దతు తెలిపారంటూ ఆయన మనవడు రంజిత్ సావర్కర్ కూడా ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ గతంలో కూడా వీర సావర్కర్ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది సావర్కర్ బ్రిటిష్ వారికి రాసిన లేఖ అంటూ చదివి వినిపించారు కూడా.
అప్పుడు కూడా ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ వ్యవహార శైలిని తప్పుబట్టారు. ఇప్పుడు మరోసారి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉద్ధవ్ ఠాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనపై రెండు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. స్వాతంత్రం కోసం పోరాడిన ఒక గొప్ప నాయకుడు గురించి ఇలా మాట్లాడటం, దేశం కోసం జైలుపాలైన వ్యక్తి గురించి ఈ వ్యాఖ్యలు చేయడం తగదంటున్నారు. ఆయన పేరును రాజకీయాల్లోకి లాగి చర్చలకు తెర లేపడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతాన్ని తవ్వి ఇప్పుడు ఎవరి పేరును చెడగొట్టాలని చూస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. వీర సావర్కర్ విషయంలో పదే పదే రాహుల్ గాంధీ కామెంట్స్ చేయడం ఎంత వరకు కరెక్ట్? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Rahul Gandhi on Cambridge remark: ‘I am not Savarkar, will not apologise’
Catch the day’s latest news ➠ https://t.co/dbtaqmipiH pic.twitter.com/JEMez7ZQfr— Economic Times (@EconomicTimes) March 25, 2023