యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి? దీని వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం? ఎందుకు ఈ సివిల్ కోడ్ పై వ్యతిరేకత వస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి రాజ్యాంగం ఏం చెబుతుంది? ఈ యూసీసీ చట్టం విషయంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ వ్యూ ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం.
యూనిఫామ్ సివిల్ కోడ్. ప్రస్తుతం ఈ పేరు బాగా వినిపిస్తోంది. ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫామ్ సివిల్ కోడ్) అంటే అందరికీ ఒకటే చట్టం అని అర్థం. ఈ కొత్త చట్టాన్ని భారతీయ జనతా పార్టీ ప్రతిపాదించింది. అయితే ఉమ్మడి పౌర స్మృతిని ఆమోదించే వర్గం ఉన్నట్టే.. ఆమోదించని వర్గం కూడా ఉంది. ఉమ్మడి పౌర స్మృతిని ఎందుకు ఆమోదించడం లేదు. కొత్త చట్టం ఆమోదించిన క్రమంలో ఇంత రచ్చ ఎందుకు జరుగుతుంది? కొన్ని రాష్ట్రాల్లో దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ చట్టం తీసుకొస్తుండడం వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ కొత్త చట్టం వల్ల దేశానికి లాభమా? నష్టమా? అనే విషయాలు తెలుసుకుందాం.
ఆర్టికల్ 370, సీఏఏ, ఎన్ఆర్సీ వంటి చట్టాలు తీవ్ర చర్చకు దారి తీశాయి. అప్పుడు కూడా దీన్ని పలు రాజకీయ పార్టీలు, ప్రజలు వ్యతిరేకించారు. కట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి పౌర స్మృతితో చర్చ మొదలైంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉమ్మడి పౌర స్మృతి వ్యవహారం మళ్ళీ ఊపందుకుంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ నేతలు అందరూ ఉమ్మడి పౌర స్మృతిని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ఉంది. అంటే నేరానికి పాల్పడిన వారు ఏ మతానికి చెందిన వారైనా, ఏ వర్గానికి చెందిన వారైనా గానీ శిక్షార్హులే. వారి బ్యాక్ గ్రౌండ్ తో సంబంధం లేకుండా శిక్షలు అనేవి పడుతున్నాయి. కానీ ఉమ్మడి పౌర స్మృతి విషయానికి వచ్చేసరికి ఒక్కో మతానికి ఒక్కోలా ఉంటుంది.
పెళ్లి, విడాకులు, ఆస్తి పంపకాలు, దత్తత, ఆహారం వంటివి ప్రజల వ్యక్తిగత వ్యవహారాలు. అయితే వీటిలో మతానికి సంబంధం లేకుండా ఒకే విధమైన చట్టాన్ని తీసుకురావడం కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. దీన్నే ఉమ్మడి పౌర స్మృతిగా పేర్కొంది. దేశంలో ప్రస్తుతం మతం ఆధారంగా ఉన్న వ్యక్తిగత చట్టాలను తొలగించి వాటి స్థానంలో ఒకే ఒక చట్టంగా ఉమ్మడి పౌర స్మృతిని తీసుకురావాలన్నది బీజేపీ ముఖ్య ఉద్దేశం. నిజానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో ఉమ్మడి పౌర స్మృతి గురించి ప్రస్తావించబడి ఉంది. దేశ ప్రజల ఉమ్మడి పౌర స్మృతి కోసం ప్రభుత్వం ప్రయత్నించాలని ఆ ఆర్టికల్ లో పేర్కొన్నారు.
అయితే ఈ అంశంలో ఉన్న సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని రాజ్యాంగ రూపకర్తలు.. ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేసే అంశాన్ని పూర్తిగా ప్రభుత్వానికే స్వేచ్ఛనిచ్చారు. గతంలో కేంద్రంలోని చాలా ప్రభుత్వాలు ఉమ్మడి పౌర స్మృతి అంశంపై చర్చలు జరిపాయి కానీ కార్యరూపం దాల్చలేదు. అయితే బీజేపీ పార్టీ మాత్రం ఉమ్మడి పౌర స్మృతి చట్టాన్ని అమలు చేస్తామని 1998, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. 2019 నవంబర్ లో నారాయణ్ లాల్ పంచారియా ఉమ్మడి పౌర స్మృతిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో దాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత 2020 మార్చి నెలలో కిరోడిలాల్ మీనా ఈ బిల్లును తీసుకొచ్చారు. కానీ పార్లమెంటులో ప్రవేశ పెట్టలేదు.
దేశంలోని వివిధ కుటుంబ చట్టాల్లోని కొన్ని పద్ధతుల వల్ల మహిళలు వివక్షకు గురవుతున్నారని.. వీటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని 2018 నాటి లా కమిషన్ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి, విడాకులు, దత్తత, వారసత్వానికి సంబంధించిన చట్టాల్లో సమానత్వం కోరుతూ సుప్రీం కోర్టు వద్ద చాలా పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయి. ముస్లిం చట్టం ప్రకారం ట్రిపుల్ తలాక్ అంటే విడాకులు మంజూరు అయిపోయినట్టే. దీని వల్ల మహిళలకు అన్యాయం జరుగుతుందనేది కొంతమంది వాదన. అలానే ఆస్తి పంపకాలు, పెళ్లి వంటి వాటితో కూడామహిళలకు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి సమస్యలకు మతంతో సంబంధం లేకుండా ఉమ్మడి పౌర స్మృతి అడ్డు కట్ట వేస్తుందని కేంద్ర ప్రభుత్వం బలంగా నమ్ముతోంది.
అయితే యూనిఫామ్ క్రిమినల్ కోడ్ ని అమలు చేసినంత సులువుగా యూనిఫామ్ సివిల్ కోడ్ ని అమలు చేయడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ చట్టం అమలు చేస్తే ప్రజల మత స్వేచ్ఛపై ప్రభావం పడుతుందని.. భిన్న మతాలు, ఆచారాలు కలిగిన భారతదేశంలో ఇటువంటి చట్టాల అమలు అసాధ్యమని అంటున్నారు. ఈ చట్టం వల్ల మైనారిటీలపై ప్రతికూల ప్రభావం పడుతుందని.. వారికున్న ప్రత్యేక హక్కులు కోల్పోయే అవకాశం ఉందని మరి కొంతమంది వాదన. ఉమ్మడి పౌర స్మృతిని తీసుకొచ్చినా క్షేత్ర స్థాయిలో అమలు చేయడం కష్టమని అంటున్నారు. అలా అని ఈ చట్టాన్ని తీసుకురాకపోతే కొన్ని సమస్యలకు పరిష్కారం ఎప్పటికీ దొరకదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
విడాకులు, రక్షణ, సంరక్షకత్వం, వారసత్వం వంటి చట్టాల నియంత్రణను కోరుతూ అనేక మంది అనేక పిటిషన్లు వేశారు. ఇస్లామిక్ చట్టాలు అనుమతిస్తున్న తక్షణ విడాకులు, కాంట్రాక్ట్ పెళ్లి, విడాకుల విషయంలో మరో వ్యక్తితో స్వల్పకాలిక వివాహం వంటి విధానాల వల్ల వివక్షకు గురైన ముస్లిం మహిళలు ఈ విధానాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ఎన్నో పిటిషన్లు వేశారు. అవన్నీ సుప్రీంకోర్టులో ఇంకా అలానే పెండింగ్ లో ఉన్నాయి. ఈ పెండింగ్ పిటిషన్స్ కి పరిష్కారం దొరకాలన్నా, ఆ మహిళల కన్నీటిని తుడవాలన్న ఉమ్మడి పౌర స్మృతి వల్లే అవుతుందని అంటున్నారు. ముస్లిం మహిళలకే కాదు.. సిక్కు మహిళలకు, హిందూ మహిళలకు కూడా ఈ ఉమ్మడి పౌర స్మృతి ఉపయోగపడుతుంది.
సిక్కుల విడాకులకు చాలా అడ్డంకులు ఉన్నాయి. హిందూ మతాన్ని అనుసరించే చాలా గిరిజన తెగలు వివిధ చట్టాలను అమలు చేసుకుంటున్నాయి. ఇలా వీరందరినీ ఉమ్మడి పౌర స్మృతి ఏకం చేస్తుంది. మైనారిటీలు, మహిళలకు హాని కలిగించే చట్టాల నుంచి ఈ ఉమ్మడి పౌర స్మృతి రక్షణ కల్పిస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భావించారు. అంతేకాదు ఉమ్మడి పౌర స్మృతి వల్ల అందరూ ఒకటే అన్న జాతీయ భావాన్ని ప్రమోట్ చేస్తుందని అంబేద్కర్ భావించారు. మరి దేశమంతా అందరికీ ఒకటే ఉమ్మడి పౌర స్మృతి చట్టంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.