మీరు గర్భిణీ స్త్రీలా..? అయితే మీరు ఈ పథకం గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. మాతృ వందన యోజన పథకం కింద గర్భిణీ మహిళలకు కేంద్ర ప్రభుత్వం రూ.5వేలు ఆర్థిక సహాయం అందిస్తోంది. మీరు కూడా ఈ పథకంలో చేరి ఆ ప్రయోజనాలు పొందగలరని మనవి.
ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇందులో చిన్న పిల్లలు మొదలు పెద్ద వారికి వరకు ప్రయోజనాలు చేకూర్చే పథకాలు అనేకం ఉన్నాయి. అలా గర్భిణీ మహిళల కోసం తీసుకొచ్చిన పథకమే.. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన. ఈ పథకం ద్వారా కేంద్రం.. గర్బిణీ స్త్రీలకు రూ.5 వేలు ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 3 కోట్ల మంది గర్భిణీ స్త్రీలు లబ్ధి పొందినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఈ పథకంలో ఇప్పటి వరకు 3.32 కోట్ల మంది నమోదు చేసుకోగా.. రూ.13,766 కోట్ల మేర పంపిణీ చేశారు. ఈ పథకంలో ఎలా చేరాలి..? ఎవరు అర్హులు..? రూ. 5,000 ఎప్పుడు ఖాతాల్లోకి చేరతాయి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
గర్భం దాల్చిన క్రమంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తకుండా, సరైన వైద్యం అందించాలన్నదే మాతృ వందన యోజన పథకం ముఖ్య ఉద్దేశం. రోజు వారీ కూలీ చేసుకునే మహిళలు, ఆర్థికంగా వెనకబడిన మహిళలు ఎవరైనా ఈ పథకంలో చేరవచ్చు. అయితే మొదటి కాన్పుకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా గర్బిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు రూ.5 వేలు డెరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా వారి ఖాతాల్లోకి జమ చేస్తారు. అయితే ఈ డబ్బులు ఒకేసారి రావు. మూడు విడతలుగా మహిళల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. తొలి విడత కింద రూ.1000 ఈ పథకంలో రిజిస్టర్ అవ్వగానే వస్తాయి. తర్వాత రెండో విడత కింద గర్భిణి ఆరో నెలలో ఉండగా రూ.2 వేలు జమవుతాయి. అనంతరం చివరి విడతగా బిడ్డకు జన్మనిచ్చాక మరో రూ.2 వేలు లభిస్తాయి.
మీరు ప్రధాన మంత్రి మాతృ వందన యోజనలో చేరాలనుకుంటే ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. https://pmmvy-cas.nic.in/public/beneficiaryuseraccount/login లేదా Umang యాప్ ద్వారా నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అక్కడ బెనిఫీషియరీ లాగిన్ అని ఉంటుంది. రిజిస్టర్ చేసుకొని లాగిన్ అవ్వాలి. ఇవన్నీ తెలియని యెడల స్థానిక ఆశా వర్కర్‌ను కలిసినా వారు ఈ స్కీమ్‌లో మిమ్మల్ని చేర్పిస్తారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలని భావిస్తే.. ఎల్ఎంపీ(లాస్ట్ మెన్స్ట్రువల్ పిరియడ్) డేట్ కచ్చితంగా తెలిసి ఉండాలి. అలాగే ఇందు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో రిజిస్టర్ చేసుకున్నట్లు కొన్ని డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. వాటి గురించి మీ ఆశా వర్కర్ ని అడిగి పూర్తి వివరాలు తెలుసుకోండి.