పంచ నదులు పారే పుణ్యభూమి పంజాబ్.. ఎప్పుడూ పచ్చని పంటపొలాలతో ఉండే ఆ ప్రాంతంలో కొన్ని దశాబ్దాల క్రితం ఓ హింసాత్మక సంఘటన చోటు చేసుకుంది. మళ్లీ అలాంటి భయాందోళనలు కలిగించే కార్యక్రమాలు పంజాబ్‌లో జరుగుతున్నట్లు చర్చ నడుస్తోంది. ఇంతకీ పంజాబ్‌లో ఏం జరుగుతోంది?
ఐదు నదులు పారుతూ.. ఏడాది పొడుగునా పంటలు పండే పచ్చటి రాష్ట్రం పంజాబ్. ఈ ప్రాంతానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాంటి పంజాబ్‌లో 1984లో జరిగిన అల్లకల్లోలం అంతా ఇంతా కాదు. దేశచరిత్రలో అదో మర్చిపోలేని ఘట్టం. దాని నుంచి పూర్తిగా కోలుకుని.. తిరిగి సాధారణ పరిస్థితులు స్థిరమవుతున్న తరుణంలో.. మరోసారి పాత పంజాబ్‌ను తలపిస్తున్నాయి తాజా పరిస్థితు. వేలమంది రోడ్లపైకి వచ్చి ఖడ్గాలు, బల్లెలాలతో భారీ ర్యాలీలు తీస్తున్నారు. ఈ మధ్యనే ఒక పోలీస్ స్టేషన్‌పై కొంతమంది మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇలాంటి పరిస్థితులు పంజాబ్‌లో ఎందుకు తలెత్తుతున్నాయి? ప్రశాంత పంజాబ్ ఎందుకు మళ్లీ నివురుగప్పిన నిప్పులా మారుతుంది? అసలింతకీ అక్కడ ఏం జరుగుతోంది? క్లుప్తంగా తెలుసుకుందాం..
సిక్కు మతం ప్రాతిపదికన పంజాబ్‌ను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా మంది సిక్కుల్లో ఉంది. దాన్నే వాళ్లు ఖలిస్థాన్‌గా పేర్కొంటారు. ఈ ఖలిస్థానీ ఉద్యమం 1970లో ప్రారంభమైంది. 1984లో తీవ్ర రూపం దాల్చి హింసాత్మకంగా మారింది. దీంతో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో పంజాబ్‌లోని అమృత్‌సర్ స్వర్ణదేవాలయంలో ఉన్న ఖలిస్థాన్ ఉద్యమకారులను కాల్చి చంపారు. ఆ ఆపరేషన్ బ్లూస్టార్‌తో సిక్కుల ఊచకోత జరిగినట్లు చరిత్ర చెబుతుంది. ఆ తర్వాత కొన్నేళ్లుగా ఖలిస్థాన్ ఉద్యమం కనుమరుగైంది. మళ్లీ ఇప్పుడు.. వేర్పాటువాదులు కొంతమంది ఖలిస్థాన్ ఉద్యమాన్ని భుజాన ఎత్తుకున్నారు.
అమృత్‌పాల్ సింగ్ అనే 29 ఏళ్ల కుర్రాడు ఇప్పుడు ఖలిస్థాన్ ఉద్యమానికి నాయకుడిగా మారిపోయాడు. 2022 వరకు ఇతని పేరు కూడా ఎవరికీ తెలియదు. ఇంజినీరింగ్ చదివిన ఓ సాధారణ వ్యక్తి. కానీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉండేవాడు. దుబాయ్‌లో ఉద్యోగం చేసుకుంటూ ఉండే అమృత్‌పాల్ సింగ్.. ‘వారిస్ పంజాబ్ దే’ సంస్థ వ్యవస్థాపకుడు, యాక్టర్ దీప్‌సిద్ధూ మరణంతో ఆ సంస్థకు నాయకుడిగా తనకు తానే ప్రకటించుకున్నాడు. ఆ సంస్థ అనుచరులకు మార్గదర్శకాలు ఇస్తూ.. వారి సమ్మతిని సైతం పొందాడు. ‘వారిస్ పంజాబ్ దే’కు తానే నాయకుడినని అమృత్‌పాల్ ప్రకటించుకోవడాన్ని ప్రారంభంలో సిద్ధూ కుటుంబీకులు ఒప్పుకోలేదు. కానీ.. ఖలిస్థానీ కార్యకలాపాలకు అమృత్‌పాల్ పంజాబ్‌నే కేంద్రంగా ఎంచుకోవడంతో.. ఖలిస్థాన్ సానుభూతిపరులు అమృత్‌పాల్ నాయకత్వానికి మద్దతుపలికారు.
అమృత్‌పాల్ నేతృత్వంలో వారిస్ పంజాబ్ దే కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో పంజాబ్ పోలీసులు ఆ సంస్థపై నిఘా పెట్టాయి. ఖలిస్థానీ సానుభూతిపరుడు, అమృత్‌పాల్ సింగ్‌కు సన్నిహితుడైన లవ్‌ప్రీత్ సింగ్ అలియాస్ తూఫాన్ సింగ్‌ను ఇటీవల పంజాబ్ పోలీసులు ఓ కిడ్నాప్ కేసులో అరెస్ట్ చేశారు. అతని అరెస్ట్‌ను నిరసిస్తూ.. అమృత్‌సర్‌లోని అజ్‌నాలా పోలీస్ స్టేషన్‌పై దాడికి తెగబడ్డారు. దీంతో పోలీసులు లవ్‌ప్రీత్‌ను విడిచిపెట్టారు. ఇలా ప్రజలు పోలీస్ స్టేషన్ దాడి చేసి నిందితుడిని విడిపించుకువెళ్లిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే.. ఈ అల్లర్లకు అమృత్‌పాల్ సింగ్ కారణమని, పంజాబ్ యువతను రెచ్చగొడుతున్నాడని పోలీసులు అమృత్‌పాల్ సింగ్‌పై కేసు నమోదు చేశారు.
శనివారం అతని జాడను పక్కా కనిపెట్టిన పోలీసులు.. సినిమా రేంజ్‌లో వంద కార్లతో కొన్ని గంటల సేపు చేజ్ చేసి అమృత్‌పాల్ సింగ్‌ను పట్టుకోవడానికి ట్రై చేశారు. కానీ అతడు పరారయ్యాడు. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. ఇక అమృత్‌పాల్ డ్రగ్ అడిక్షన్ కేంద్రాలను, ఒక గురుద్వారాను అడ్డం పెట్టుకుని ఆయుధాలను నిల్వ చేయడంతోపాటు ఆత్మాహుతి దాడులకు యువతను సిద్ధం చేస్తున్నాడని నివేదికలో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా అమృత్‌పాల్‌ను అరెస్ట్ చేశారనే వార్త పంజాబ్ వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. దీంతో.. ఖలిస్థానీ మద్దతుదారులు, అమృత్‌పాల్ సింగ్ ఫాలోవర్లు.. కత్తులు, తల్వార్లతో రోడ్లపైకి వచ్చేశారు. కొన్ని వందల మంది అలా సాయుధులై రోడ్లపై ర్యాలీ తీస్తున్న వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పంజాబ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరి పంజాబ్‌లో నెలకొన్న పరిస్థితులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Protest taken out from Quami Insaaf Morcha in Mohali after the report of arrest of Amritpal Singh #AmritpalSingh pic.twitter.com/Gb1y57A5AK
— Gagandeep Singh (@Gagan4344) March 18, 2023