పార్థ ఛటర్జీ.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈయన పేరు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. పశ్చిమ బెంగాల్ టీచర్ రిక్రూట్మెంట్ కుంభకోణం కేసులో ఎన్నో కీలక విషయాలు వెలుగు చూశాయి. ఇప్పటికే సీఎం మమతా బెనర్జీ ఆయన మంత్రి పదవిని తొలగించడమే కాకుండా.. పార్టీలోని అన్ని పదవుల నుంచి తొలగించిన విషయం తెలిసిందే.
మాజీ మంత్రి పార్థ ఛటర్జీ సన్నిహితురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లోనే ఇప్పటి వరకు రూ.50 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పుడు మంత్రి పాత అఫిడవిట్ లెక్కలు కొన్ని వెలుగులోకి వచ్చాయి. ఆ అఫిడవిట్ లెక్కలు ఇప్పుడు వెలుగు చూస్తున్న కోట్ల నగదు చూస్తుంటే ప్రజలంతా విస్తుపోతున్నారు. పదేళ్లలోనే ఇంత మార్పా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
2011 ఎన్నికల సమయంలో పార్థ ఛటర్జీ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ లో తన చేతిలో కేవలం రూ.6,300 మాత్రమే ఉన్నాయంటూ చూపించారు. ఆ తర్వాత 2021 ఎన్నికల నాటిని ఆ మొత్తాన్ని 23 రెట్లు పెంచి ప్రస్తుతం రూ.1,48,676 ఉన్నాయని లెక్కల్లో చూపించారు. కానీ, ఈ కుంభకోణం వెలుగు చూసిన తర్వాత ఆయన సన్నిహితురాలి దగ్గరే రూ.50 కోట్లు దొరకడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చకు దారితీసింది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.