పెళ్ళిలో వచ్చిన బహుమతి వరుడి ప్రాణం తీసింది. పెళ్ళైన రెండు రోజులు కూడా కాలేదు. ఆ ఒక్క బహుమతి నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
బహుమతులను ఇష్టపడని వారు ఉండరు. పెళ్ళైనా, పుట్టినరోజు అయినా, ఏ చిన్న కార్యక్రమమైనా గానీ బహుమతులను ఇస్తుంటారు. కొందరు దేవుడి చిత్ర పటాలను ఇస్తే.. కొందరు బంగారు ఆభరణాలు వంటివి ఇస్తుంటారు. కొందరు ఫ్రిడ్జ్ లు, మిక్సీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఇస్తుంటారు. కొత్త కాపురం కాబట్టి వధూవరులకు గృహోపకరణములు ఎక్కువగా ఇస్తుంటారు. ఆ బహుమతులను ఓపెన్ చేసి చూసుకుని మురిసిపోతుంటారు వధూవరులు. ఈ క్రమంలో ఓ జంటకు వచ్చిన బహుమతి వారి పాలిట శాపంగా మారింది. భర్త ప్రాణాన్ని తీసి.. యువతిని ఒంటరి దాన్ని చేసింది. పెళ్ళైన రెండు రోజులకే వరుడి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది.
ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లాలోని చమరి గ్రామానికి చెందిన హేమేంద్ర మేరవికి (22), అంజనా గ్రామానికి చెందిన యువతికి ఇటీవలే వివాహం జరిగింది. అయితే ఈ పెళ్ళికి వచ్చిన బంధువులు, స్నేహితులు వధూవరులకు బహుమతులు ఇచ్చారు. అయితే బహుమతులను ఒక్కొక్కటిగా ఓపెన్ చేసి చూడబోయాడు హేమేంద్ర. ఆ క్రమంలో తమకు బహుమతిగా వచ్చిన హోమ్ థియేటర్ ను తన కుటుంబ సభ్యులతో కలిసి ఓపెన్ చేశాడు. ఆ హోమ్ థియేటర్ ను పవర్ సాకెట్ లో పెట్టి ఆన్ చేశాడు. అంతే ఒక్కసారిగా హోమ్ థియేటర్ పేలిపోయింది. పేలుడు ధాటికి ఇంటి పై కప్పు ఎగిరిపోయి గోడ కూలిపోయింది.
ఈ ఘటనలో హేమేంద్ర అక్కడికక్కడే మృతి చెందగా.. అతని సోదరుడు రాజ్ కుమార్ (30), ఏడాదిన్నర బాబుకి తీవ్ర గాయాలయ్యాయి. అయితే చికిత్స చేస్తుండగా రాజ్ కుమార్ మృతి చెందాడు. అయితే ఈ పేలుడుకి గల ఖచ్చితమైన కారణం తెలియాల్సి ఉంది. పేలుడుకు గల కారణాలు ఏంటి అనే దానిపై ఫోరెన్సిక్ నిపుణులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు జరగక ముందు ఇంట్లో హోమ్ థియేటర్ తప్పితే మండే వస్తువులు లేవని పోలీసులు తెలిపారు. అయితే ఇదేమైనా కుట్రలో భాగంగా జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.