ప్రపంచంలో చాల వింతలు ఉన్నాయి. ఒక్కో ప్రాంతంలో వింత ఆచార సంప్రదాయాలు ఉంటాయి. కానీ కర్ణాటకలో ఓ గ్రామస్థులు మాత్రం వాటితో ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు. దావణగెరె జిల్లాలో నాగేనహళ్లి గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆ ఊళ్లోని ప్రజలు అత్యంత విషపూరితమైన నాగుపాములతో పాటు నివసిస్తున్నారు. చిన్నపిల్లలు కూడా ఏ మాత్రం భయం లేకుండా వాటితో ఆడుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు. ఏ ఇంటికి వెళ్లినా అక్కడ గుట్టలుగుట్టలుగా పాములు ఉంటాయి. ఆ పాములు వారిని కాటు వేసినా వారికి ఏమీ కాదు. ఆ వూరి రహస్యమేంటో ఇప్పటి వరకూ సైన్ కు అందని మిస్టరీగా మిగిలిపోయింది.
వందల ఏళ్లుగా పాములతో కలిసి జీవిస్తున్నా ఒక్కరు కూడా వాటి కాటువల్ల చనిపోలేదని గ్రామస్థులు చెబుతున్నారు. నాగేనహళ్లి గ్రామంలో శివాలయం, ఆంజనేయ స్వామి దేవాలయాల ప్రాంగణాల్లోకి తరచుగా నాగుపాములు వస్తుంటాయి. అక్కడికి వచ్చిన పాములు ఎవరికీ హాని తలపెట్టవు. దైవానుగ్రహం వల్లనే అలా జరుగుతుందని స్థానికులు పేర్కొన్నారు. ఒకవేళ ఏదైనా పాము కాటు వేస్తే మూడురోజుల పాటు ఆంజనేయస్వామి దేవాలయంలో బస చేసి, గుడిలో అందించే తీర్థం తాగితే ప్రాణహాని ఉండదని గ్రామస్థుల నమ్మకం.
గ్రామస్థులు ఊళ్లో కనిపించే పాములను దైవస్వరూపంగా భావిస్తారు. ప్రమాదవశాత్తు ఏదైనా పాము చనిపోతే మనుషుల మాదిరిగానే అంతిమ సంస్కారాలు చేస్తారు ఆ పాములను తమ పెంపుడు జంతువుల్లా భావిస్తూ తమ పని తాము చేసుకుని పోతుంటారు.