బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ విమాన తయారీ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అక్కడి ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు అత్యాధునిక ఆయుధాలు, యుద్ధ విమానాల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వివరించారు. హెచ్‌ఏఎల్ శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల గురించి వెంకయ్యనాయుడు మాట్లాడారు. దేశీయ వైమానిక పరిశ్రమ అభివృద్ధిలో హెచ్ఏఎల్‌ది కీలక పాత్రని వెంకయ్యనాయుడు అన్నారు. సంఘటిత, పర్యావరణహిత అభివృద్ధి అజెండాగా వెళ్లాలని వెంకయ్యనాయుడు సూచించారు.
రాబోయే సంవత్సరాల్లో భారతదేశం ఏరోస్పేస్, డిఫెన్స్ పవర్‌హౌస్‌గా దూసుకెళ్లడంలో దేశీయ ఉత్పత్తులు కీలక పాత్ర పోషిస్తాయని ఉపరాష్ట్రపతి అన్నారు. “మనం ఇప్పటికీ ప్రపంచంలోనే ఎక్కువగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఉన్నాం” అని ఆయన అన్నారు. స్వదేశీ సాంకేతికత అభివృద్ధి వేగాన్ని పెంచడం ద్వారా ఈ పరిస్థితిని మార్చాలని వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. రక్షణరంగ ఉత్పత్తుల అతిపెద్ద ఎగుమతి దారుగా భారత్ ఎదగాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. భద్రతా దళాల ధైర్యం, నైపుణ్యాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. రక్షణ రంగ ఉత్పత్తులు ఆత్మ రక్షణ కోసమే తప్ప, దాడుల కోసం కాదని ఉపరాష్ట్రపతి అన్నారు. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేటు భాగస్వామ్యం అవసరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గుర్తు చేశారు.
భారతదేశం పొరుగువారితో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటోందన్నారు. కొన్ని దేశాలు భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదం, నౌకాశ్రయ విస్తరణలకు నిధులు సమకూర్చుతున్నాయని ఉపరాష్ట్రపతి అన్నారు. ఈ సందర్భంగా మన సరిహద్దుల భద్రత చాలా ముఖ్యమని ఆయన అన్నారు. మన దేశం ఎప్పుడూ సామ్రాజ్యవాదాన్ని ప్రోత్సహించలేదని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. భారతదేశం తన ప్రజల పురోగతి, అభివృద్ధి కోసం బలంగా మారాలని కోరుకుంటోంది” అని ఆయన అన్నారు.
రక్షణ రంగానికి ఎఫ్‌డీఐ పరిమితి పెంపు, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో రెండు రక్షణ కారిడార్ల ఏర్పాటు నిర్ణయాలు భారత రక్షణరంగ అభివృద్ధికి దోహదపడతాయని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు.