ఒక చెట్టు దానికదే అంటుకుంది. మంటలు అంటుకోవడంతో స్థానికులు ఫైర్ ఇంజన్ కి సమాచారం ఇచ్చారు. అయితే ఫైర్ ఇంజన్ వచ్చి మంటలు ఆర్పే కొద్దీ ఆ చెట్టు మంటలు ఆగడం లేదు. ఆ చెట్టు మండుతూనే ఉంది.
ఉత్తర ప్రదేశ్ లోని ఫుల్పూర్ లోని తర్దిహ్ గ్రామంలో వింత ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామంలో 200 ఏళ్ల నాటి రావి చెట్టు ఉంది. ఈ చెట్టును గ్రామస్తులు మల్లయోధుడు వీర్ బాబా పేరుతో పూజిస్తారు. అయితే వారం క్రితం ఈ రావి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయారు. అయితే ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ చెట్టుకు మంటలు అంటుకున్నాయి. మరోసారి ఫైర్ ఇంజన్ గ్రామంలోకి వచ్చింది. రెండోసారి మంటలను అదుపు చేస్తే మరలా మూడోసారి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలో ఫైర్ సిబ్బంది అసహనానికి గురయ్యారు. అయితే ఇలా జరగడం అద్భుతం అని, దీనికి కారణం వీర్ బాబా ఏదో విషయంలో కోపంగా ఉన్నాడని.. అందుకే ఈ చెట్టుకు మంటలు అంటుకుంటున్నాయని గ్రామస్తులు అంటున్నారు. వీర్ బాబా శాంతించేవరకూ మంటలు కొనసాగుతూనే ఉంటాయని అంటున్నారు.
అగ్నిమాపక శాఖ డ్రైవర్ చెప్పిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన సునీల్ పాండే అనే వ్యక్తి తమ గ్రామంలో చెట్టుకు మంటలు అంటుకున్నాయని సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న తాము వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశామని అన్నారు. మొదటిరోజు మంటలను అదుపులోకి తెచ్చిన తర్వాత మరోసారి మంటలు చెలరేగాయని, ఆ మంటలను కూడా అదుపు చేశామని అన్నారు. అయితే సునీల్ పాండే మరోసారి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. మంటలు మళ్ళీ వస్తున్నాయని చెప్పడంతో మరోసారి వెళ్ళమని అగ్నిమాపక సిబ్బంది డ్రైవర్ వెల్లడించారు. మంటలను అదుపు చేసే క్రమంలో ఒక చెట్టుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు తాము మూడు ట్యాంకర్లను వాడాల్సి వచ్చిందని అన్నారు.
ఈ రావి చెట్టు స్థానిక ప్రజల విశ్వాసంగా, నమ్మకంగా ఉంటుందని గ్రామస్తులు వెల్లడించారు. ఏ శుభప్రదమైన కార్యక్రమానికైనా భక్తులు, రైతులు అందరూ ఈ రావి చెట్టును పూజిస్తారు. ఈ చెట్టు 150 ఏళ్ల నాటిదని, ఇక్కడి ప్రజలకు విశ్వాసం విపరీతంగా ఉంటుందని అదే గ్రామానికి చెందిన ముఖియా బాబా అన్నారు. తరచుగా ఈ రావి చెట్టుకు మంటలు అంటుకునున్నాయని అన్నారు. మంటలు ఇలా వ్యాపించడం పట్ల వీర్ బాబా కోపంగా ఉన్నాడని అనుమానంగా ఉందని అంటున్నారు. చెట్టు కూలిపోయినప్పుడు తుఫాను వస్తుందని.. అది సినిమాల్లో మాత్రమే చూస్తామని.. కానీ తాము నిజంగా ఈ సంఘటనను చూశామని ఆ గ్రామానికి చెందిన ధర్మేంద్ర రావత్ అన్నారు. ఒకరోజు ఈ రావి చెట్టు పడిపోయినప్పుడు భయంకరమైన తుఫాను వచ్చిందని అన్నారు. ఇది యాదృచ్చికంగా జరిగిందా లేక అద్భుతం అని అనాలో తెలియదు గానీ చెట్టు విరిసాగిపోయినప్పుడు బలమైన గాలులు వీయడం మొదలైందని.. ఆ వేగం మరింత పెరిగిందని అన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటి? ఒక చెట్టుకు మంటలు అంటుకుంటే ఫైర్ మూడు ట్యాంకర్ల నీరు వాడారంటే అద్భుతం అనాలా? లేక సహజమైన చర్య అనుకోవాలా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.