వందే భారత్ రైలు ఢీకొన్న ఘటనలో ఒక జింకతో పాటు ఓ వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు..
భారతీయ రైల్వే వ్యవస్థలో వందే భారత్ రైళ్లు ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాయి. సరైన సమయానికి స్టేషన్‌కు చేరుకోవడం, అత్యంత వేగవంతమైన ప్రయాణం, అత్యాధునిక సదుపాయాలు, పరిశుభ్రత.. ఇలా అన్నింటా వందే భారత్ రైళ్లు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ రైళ్లు సూపర్ సక్సెస్ కావడంతో విదేశాల నుంచి కూడా వీటి కోసం ఆర్డర్లు వస్తున్నాయి. అయితే వందే భారత్ రైళ్లు తరచూ ప్రమాదాలకు గురవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఆవులు, గేదెలను ఈ ట్రైన్స్ ఢీకొన్న ఘటనల గురించి ఈమధ్య వార్తల్లో చూస్తూనే ఉన్నాం. గతేడాది జూన్ నెల నుంచి డిసెంబర్ మధ్య ఆరు రూట్లలో నడుస్తున్న వందే భారత్ రైళ్లు 68 సార్లు పశువులను ఢీకొట్టిన ఘటనలు చోటుచేసుకున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ లోక్‌సభలో తెలిపారు.
పలు ప్రమాదాల్లో వందే భారత్ రైళ్ల ముందుభాగం బాగా దెబ్బతినడం పైనా వార్తలు వచ్చాయి. దీంతో ఈ ట్రైన్స్ నాణ్యతపై ప్రయాణికుల్లో సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, స్పీడ్‌గా వెళ్తున్న ఒక వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. రైలు పట్టాల మీద ఉన్న ఓ నీల్గాయ్ జింకను వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ జింక గాల్లో ఎగిరి దగ్గర్లో ఉన్న ఒక వ్యక్తిపై పడింది. రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లా, కలిమోరి రైల్వే లెవల్ క్రాసింగు దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్లో నీల్గాయ్ జింకతో పాటు ఆ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. దీంతో ఆ రైలును కాసేపు నిలిపివేశారు. జింకపై పడి మృతి చెందిన వ్యక్తిని రైల్వే రిటైర్డ్ ఉద్యోగి శివదయాళ్‌గా పోలీసులు గుర్తించారు. ఆయన మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ట్రైన్ ఢిల్లీ నుంచి అజ్మీర్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.