ఎన్నికలు వస్తున్నాయంటే చాలు ప్రచారాల జోరు, ర్యాలీల హోరుతో బిజీగా గడిపేస్తుంటారు నాయకులు. కానీ ఆ నేత మాత్రం పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. తనకు రావాల్సిన పదవి.. మరొకరికి దక్కుతుందేమోనన్న అడియాశతో లేటు వయస్సులో పెళ్లి పీటలు ఎక్కాడు. ఇంతకు అతను ఎవరంటే..?
ఒక్కసారి రాజకీయాల్లోకి అడుగు పెట్టారంటే.. అందులో నుండి బయటకు పడటం చాలా కష్టం. రాజకీయంగా ఎదిగేందుకు అనేక పనులు చేస్తుంటారు. వ్యక్తిగ జీవితాన్ని త్యాగం చేస్తుంటారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం కొంత మంది పెళ్లిళ్లు చేసుకోరు. మరీ కొంత మంది పిల్లలను కనరు. ఏదైనా పదవి కోసం నానా అగచాట్లు పడుతుంటారు. ఈ వ్యక్తి కూడా రాజకీయాల కోసమని పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ సారి గెలుపొందేందుకు సమాయత్తమయ్యాడు. కానీ అతడికి ఊహించని షాక్ నిచ్చింది ఎన్నికల నోటిఫికేషన్. దీంతో అతడూ పెళ్లి చేసుకోక తప్పలేదు. ఇంతకు ఆ నాయకుడు ఎవరంటే..?
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో ఇటీవల మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేయాలని భావించాడు మమూన్ షా ఖాన్ (45) అనే స్థానిక కాంగ్రెస్ నేత. అనుకున్నదే తడువుగా నోటిఫికేషన్ కూడా విడుదల కాకుండానే.. కొన్ని నెలల ముందు నుండే ప్రచారం మొదలు పెట్టేశారు. అయితే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అతడికి షాక్‌నిస్తూ ఓ ఉత్తర్వు జారీ చేసింది. ఈ సీటు ఈ సారి మహిళలకు రిజర్వ్ చేస్తున్నట్లు తెలిపింది. దీంతో ఖంగుతిన్న మమూన్ షా ఖాన్‌కు ఏం చేయాలో పాలు పోలేదు. పదవికి పోటీ చేయాలని ఎంతో ఆశతో బతుకుతున్న అతడి ఆశలపై నోటిఫికేషన్ నీళ్లు జల్లింది. మహిళలకు రిజర్వు చేయడం ఓ కారణమైతే.. అతడికి వివాహం కాకపోవడం మరో కారణం.
ఇటు చూస్తే నోటిఫికేషన్ సమయం కూడా ఈ నెల 17న ముగియడంతో ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా.. అయన అనుచరులు ఓ సలహాను ఇచ్చారు. పెళ్లి చేసుకుంటే సమస్య తీరుతుందని సూచించారు. పెళ్లి చేసుకుంటే తన భార్యను బరిలోకి దించొచ్చని మమూన్ భావించారు. 48 గంటల్లోనే అమ్మాయిని వెతికారు. సంబంధం సెట్ చేసుకున్నారు. అతడిని వివాహం చేసుకునేందుకు యువతి కూడా ఒప్పుకోవడంతో పెళ్లి ఏర్పాట్లు చేసుకున్నారు. ఏప్రిల్ 15న వీరి పెళ్లి జరగనుంది. ప్రస్తుతం వీరి పెళ్లి పత్రిక నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. ఈ పెళ్లి అనంతరం యువతి నామినేషన్ దాఖలు చేయనుంది.