ఏడాది వయసు గల పిల్లాడు ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే ఆ పిల్లాడి తల్లిదండ్రులు ఓ మాంత్రికుడిని ఆశ్రయించారు. బాగు చేస్తానని ఆ మాంత్రికుడు నమ్మించాడు. ఇక చివరికి మంత్రగాడు చేసిన పనికి ఆ పసి పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.
శాస్త్ర సాంకేతిక యుగం కొత్త పుంతలు తొక్కుతుంటే మారుమూల గ్రామాల్లోని కొందరు వ్యక్తులు మూఢనమ్మకాలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా వారిని ఆర్థికంగా, శారీరకంగా మోసం చేస్తూ చివరికి ఊహించని దారుణాలకు పాల్పడుతున్నారు. అచ్చం ఇలాగే ఓ మంత్రగాడు ఏడాది వయసు నిండని పిల్లాడిపై విచక్షణ కోల్పోయి ప్రవర్తించాడు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అసలు ఈ ఘటనలో ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర్ ప్రదేశ్ ధకర్ లోని ఓ మారుమూల ప్రాంతం. ఇక్కడే ఓ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి మాంత్రికులపై ఎంతో నమ్మకం. జ్వరం వచ్చినా, ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లకుండా స్థానికంగా ఉండే మాంత్రికుడిని ఆశ్రయిస్తుంటారు. అయితే వీరికి ఏడాది వయసున్న ఓ కుమారుడు జన్మించాడు. ఇటీవల పిల్లాడు అనారోగ్యానికి గురి కావడంతో వెంటనే ఆ దంపతులు అదే మాంత్రికుడి వద్దకు తమ కుమారుడిని తీసుకెళ్లారు. ఆ బాలుడిని పరీక్షించిన మాంత్రికుడు.. వైద్యం పేరుతో దారుణానికి పాల్పడ్డాడు. పసి పిల్లాడు అని చూడకుండా నేలకేసి కొట్టాడు.
ఇంతటితో ఆగని ఆ దుర్మార్గుడు.. అప్పుడప్పుడే వస్తున్న నోటి పళ్లను సైతం విరగొట్టాడు. ఆ మాంత్రికుడి దాడిలో ఆ పిల్లాడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఆ సమయంలో తల్లిదండ్రులకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక భయంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే పిల్లాడు అప్పటికే మరణించాడని వైద్యులు నిర్ధారించాడు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టిస్తుంది. వైద్యం పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ.. చివరికి ప్రాణాలు తీస్తున్న ఇలాంటి మంత్రగాళ్లపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.