ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ మృతి చెందారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితమే అనారోగ్యానికి గురయిన ములాయంసింగ్ యాదవ్‌ని గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్చి.. చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నానికి ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత విషమించింది. వెంటనే ఆయనను ఐసీయూకు తరలించారు. ములాయం సింగ్‌కి అత్యాధునిక వైద్య సేవలను అందించారు. కానీ వైద్యుల ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆయన మృతి చెందారు. ములాయం మృతితో యూపీ రాజకీయాల్లో ఓ శకం ముగిసిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు
ఇక ములాయం సింగ్ యాదవ్‌ను ఆదివారం ఐసీయూలోకి తరలించినట్లు సమాచారం అందిన వెంటనే కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కోడలు డింపుల్ యాదవ్, తమ్ముడు శివపాల్ సింగ్ యాదవ్.. హుటాహుటిన మేదాంత ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడే ఉండి తండ్రి ఆరోగ్యం గురించి వాకబు చేయసాగారు. ములాయం సింగ్ యాదవ్‌కు ఇద్దరు భార్యలు. వారిద్దరూ ఆయన కన్నా ముందే మృతి చెందారు. 2003లో ఆయన మొదటి భార్య మాలతీ దేవి కన్నుమూశారు. ఆ తరువాత ములాయం సాధన గుప్తాను వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో ఆమె తుదిశ్వాస విడిచారు.
ఇక దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తర ప్రదేశ్‌కు ములాయం సింగ్ యాదవ్ ఏకంగా మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేశారు. 1989, 1993, 2003లో యూపీకి సీఎంగా బాధ్యతలను నిర్వర్తించారు. కేంద్రమంత్రిగా వేర్వేరు శాఖలకు ప్రాతినిధ్యం వహించారు. గత కొంత కాలంగా క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు ములాయం సింగ్ యాదవ్. ప్రస్తుతం సమాజ్‌వాదీ పార్టీ బాధ్యతలను ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్ చూసుకుంటున్నారు. ములాయం మృతి పట్ల పలువురు నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.