తనకు యుక్త వయసు వచ్చినా ఇంకా పెళ్లి చేయడం లేదు అని పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఉత్తర్ప్రదేశ్ శామ్లీకి చెందిన మరుగుజ్జు యువకుడు అజీమ్ మన్సూరీ. తన వయసు 26 సంవత్సరాలని.. తన తోటి యువకులకు వివాహాలు జరుగుతన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కేవలం తాను మరుగుజ్జు గా ఉన్నానని తనకు ఎవరూ పిల్లను ఇవ్వడం లేదని.. గతంలో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి, మీడియా ముందుకు వచ్చి దేశ వ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు.
అజీమ్ మన్సూరీ గురించి తెలుసుకున్న ఓ యువతి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చింది. కానీ అతని కుటుంబ సభ్యులు ఏడాది కాలంగా పెళ్లి చేయకుండా ఏవో కారణాలు చెబుతూ ఆలస్యం చేస్తున్నారని.. దీంతో విసుగు చెందిన అజీమ్ మన్సూరీ మరోసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. ఎలాగైనా తన పెళ్లి జరిపించాలని శామ్లీ స్టేషన్ ఇంఛార్జికి మొరపెట్టుకున్నారు.
హాపుఢ్ జిల్లా కేంద్రానికి చెందిన యువతితో 2021లోనే వివాహం నిశ్చయమైనా.. తల్లిదండ్రులు జాప్యం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని రోజుల తర్వాత ఘనంగా వివాహం చేస్తామని ఇప్పటికీ చెబుతున్నారని తెలిపాడు. అయితే, అంతవరకు వేచి ఉండే ఓపిక తనకు లేదని పోలీసులకు అజీమ్ మన్సూరీ చెప్పాడు. అజీమ్ ఇచ్చిన ఫిర్యాదు స్వీకరించిన పోలీస్ అధికారి ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చేస్తానని చెప్పారు.