కాలంతో పాటు పెరుగుతున్న టెక్నాలజీని సామాన్యులు అందుకోవాలంటే ఈరోజుల్లో సాధ్యమయ్యే పనికాదు. అందుకోసం ప్రభుత్వమే టెక్నాలజీని జనాలకు దగ్గరచేసే ప్రయత్నం చేస్తుంది. సామాన్యంగా యూపీఐ పేమెంట్ సేవలు స్మార్ట్ ఫోన్స్ వరకే పరిమితమైన విషయం తెలిసిందే. త్వరలో ఫీచర్ మొబైల్(కీప్యాడ్ ఫోన్)లో కూడా యూపీఐ పేమెంట్స్ విధానం అమలు కానుంది. అదీగాక ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫీచర్ మొబైల్స్ లో యూపీఐ చెల్లింపులు చేసుకునేందుకు సరికొత్త పేమెంట్ సిస్టమ్ అందుబాటులోకి రాబోతుండటం విశేషం.
తాజాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ఈ సరికొత్త పేమెంట్ సేవలకు సంబంధించిన వివరాలను ప్రకటించారు. ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ ప్రకటనల్లో భాగంగా.. ఫీచర్ ఫోన్లకోసం డిజిటల్ పేమెంట్ సిస్టమ్ లాంచ్ చేయనున్నట్లు గతనెల 8న ఆయన స్పష్టం చేసారు. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్-ఆధారిత(UPI) ఫీచర్ ఫోన్లలో అందుబాటులోకి వస్తే.. ఇంటర్నెట్ లేకుండానే చెల్లింపులు జరిగే అవకాశం ఉందన్నారు. ఇటీవల జరిగిన ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన కమిటీ (MPC) సమావేశంలో ఆర్‌బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా యూజర్ల కోసం యూపీఐ చెల్లింపులను సులభతరం చేయడానికి శక్తికాంత దాస్ మూడు మార్గదర్శకాలు సూచించారు.
“ట్రాన్సాక్షన్స్ సంఖ్య పరంగా యూపీఐ అనేది దేశంలో అతిపెద్ద రిటైల్ చెల్లింపుల వ్యవస్థగా ఉంది. ఈ చెల్లింపులను ఎక్కడైనా అంగీకరిస్తారు. ముఖ్యంగా చిన్నపాటి పేమెంట్స్ కి కూడా యూపీఐ విధానం బాగా వాడుతున్నారు. ఈ యూపీఐ సిస్టంను మరింత మెరుగుపరచి లావాదేవీలను సులభతరం చేయడం.. యూపీఐ రిటైల్ కస్టమర్స్.. సర్వీస్ ప్రొవైడర్ల సామర్థ్యం పెంచడం.. అనే మూడు యూపీఐ పేమెంట్ ప్రొడక్టులను ఫీచర్ ఫోన్ యూజర్లకు ప్రారంభించాలి.” అని దాస్ తెలిపారు.
అంతేగాక చిన్నపాటి లావాదేవీల ప్రక్రియను ఆన్-డివైజ్ వాలెట్ ద్వారా సులభతరం చేస్తూ.. పెట్టుబడులు, ఐపీఓ అప్లికేషన్ పేమెంట్స్ కోసం రిటైల్ డైరెక్ట్ స్కీమ్ ద్వారా యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ పెంచాలని ఆర్‌బీఐ గవర్నర్ దాస్ ప్రకటించారు. ఆర్థిక మార్కెట్లలో రిటైల్ కస్టమర్లకు ఎక్కువ భాగస్వామ్యాన్ని కల్పించేందుకు ఆర్బిఐ ప్రయత్నిస్తోంది. రిటైల్ పెట్టుబడిదారుల యూపీఐ వాడకాన్ని ప్రోత్సహిస్తూ రిటైల్ డైరెక్ట్ స్కీమ్, ఐపీఓ అప్లికేషన్ యూపీఐ ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.2 – 5 లక్షల వరకు పెంచాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.