యూపీఐ యాప్ పేమెంట్స్ మీద అదనపు ఛార్జీలు విధిస్తున్నట్లు వస్తున్న వార్తలపై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) క్లారిటీ ఇచ్చింది. ఇంతకీ ఎన్పీసీఐ ఏం చెప్పిందంటే..!
ఇటీవల కాలంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) యాప్స్ ద్వారా చెల్లింపులు చేయడం రికార్డు స్థాయిలో పెరిగింది. సామాన్యులు, ధనికులు అనే తేడాల్లేకుండా అందరూ వీటికి అలవాటు పడ్డారు. చేతిలో ఫోన్ ఉంటే చాలు ఏదైనా ఇట్టే కొనేస్తున్నారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి డబ్బులు చెల్లించేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ కూడా నగదు రహిత చెల్లింపులను చాన్నాళ్లుగా ప్రోత్సహిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే ఓ వార్త యూపీఐ యూజర్లకు షాక్ తగిలేలా చేసింది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయా పేమెంట్స్ పై యూపీఐ సంస్థలు అదనపు ఛార్జీలు విధించనున్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఆ యాప్స్ వాడుతున్న వారిలో ఆందోళన రేగింది.
యూపీఐ పేమెంట్స్ మీద అదనపు ఛార్జీలు చెల్లించాల్సిందే అంటూ వస్తున్న వార్తలపై కేంద్ర సర్కారు క్లారిటీ ఇచ్చింది. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంక్ నుంచి బ్యాంక్‌కు చేసే పేమెంట్స్ పూర్తిగా ఉచితం అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వెల్లడించింది. ఈ మేరకు మార్చి 29వ తేదీన ఒక ప్రకటన జారీ చేసింది. ‘ఉచితంగా, వేగంగా, సురక్షితంగా జరుగుతున్న డిజిటల్ పేమెంట్స్ ద్వారా ఇటీవలి కాలంలో యూపీఐ అత్యంత ఆదరణ పొందుతోంది. యూపీఐ యాప్స్ ద్వారా బ్యాంకుకు లింక్ చేసి పేమెంట్స్ చేస్తున్న లావాదేవీల్లో దాదాపు 99.9 శాతం ఉన్నాయి. ఇలా బ్యాంకు నుంచి బ్యాంకుకు డబ్బులు పంపిస్తున్న ట్రాన్సాక్షన్స్ కస్టమర్లకు, మర్చంట్లకు పూర్తిగా ఫ్రీ’ అని ఎన్పీసీఐ క్లారిటీ ఇచ్చింది.
పీపీఐ మర్చంట్ లావాదేవీలకు మాత్రమే ఇంటర్‌ఛేంజ్ ఛార్జీలు వర్తిస్తాయని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అయితే, కస్టమర్లకు మాత్రం ఎలాంటి ఛార్జీలు ఉండవని వివరించింది. బ్యాంక్ అకౌంట్ నుంచి బ్యాంక్ అకౌంట్ మధ్య జరిగే యూపీఐ పేమెంట్స్‌కు ఎలాంటి అదనపు ఛార్జీలు విధించడం లేదని మరోసారి స్పష్టం చేసింది ఎన్పీసీఐ. యూపీఐ యాప్స్‌ను వినియోగించాలని అనుకుంటున్న వారు ఏ బ్యాంక్ అకౌంట్‌నైనా లేదా రూపే క్రెడిట్ కార్డు, ప్రీపెయిడ్ వ్యాలెట్స్‌ను వాడుకోవచ్చని తెలిపింది. కాగా, ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ పీపీఐ మర్చంట్ లావాదేవీలపై 0.5 శాతం నుంచి 1.1 శాతం ఛార్జీలు విధించాలని ఎన్పీసీఐ సూచించినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై స్వయంగా ఎన్పీసీఐ క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.
NPCI Press Release: UPI is free, fast, secure and seamless
Every month, over 8 billion transactions are processed free for customers and merchants using bank-accounts@EconomicTimes @FinancialXpress @businessline @bsindia @livemint @moneycontrolcom @timesofindia @dilipasbe pic.twitter.com/VpsdUt5u7U— NPCI (@NPCI_NPCI) March 29, 2023