మన సమాజంలో పురుషులు రెండో వివాహం చేసుకోవడం సర్వ సాధారణం. అదే మహిళల విషయంలోకి వస్తే.. రెండో వివాహం అనేది చాలా కష్టం. సమాజం, కట్టుబాట్లు వంటివి వారిని ఆపుతాయి. ఇక పురుషుల విషయానికి వస్తే.. వారు రెండో వివాహం చేసుకోదల్చుకుంటే.. వయసుతో సంబంధం లేకుండా వారికి పెళ్లి కుమార్తె లభిస్తుంది. వయసులో ఎంత తేడా ఉన్నా సరే. అందుకు కారణం సామాజిక, ఆర్థిక పరిస్థితులు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. 65వ ఏట ఉన్న వ్యక్తి.. అది కూడా ఆరుగురు పిల్లల తండ్రి.. తన కుమార్తె వయసున్న 23 ఏళ్ల యువతితో రెండో వివాహానికి సిద్ధపడ్డాడు. పైగా బరాత్ వేడుకలో తన ఆరుగురు కుమార్తెలతో కలిసి.. ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరలవుతోంది. ఆ వివరాలు..
ఉత్తరప్రదేశ్, బారాబంకీ జిల్లాలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బారాబంకీ జిల్లా హుసైనాబాద్ పూరే చౌధరి గ్రామానికి చెందిన నఖేద్ యాదవ్‌కు వివాహమై.. ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. అయితే కొన్నాళ్లకు నఖేద్ యాదవ్ భార్య మృతి చెందింది. అప్పటి నుంచి నఖేద్ ఒక్కడే ఒంటరిగా.. ఎంత కష్టమైన సరే.. ఆరుగురు కుమార్తెలను పెంచి పెద్ద చేశాడు. వారికి వివాహం కూడా జరిపించాడు. బిడ్డలంతా పెళ్లి చేసుకుని వెళ్లిపోవడంతో.. నఖేద్ ఒంటరి వాడయ్యాడు. పిల్లలంతా పెళ్లిళ్లు చేసుకుని అత్తారిళ్లకు వెళ్లిపోవడంతో నఖేద్ ఒంటరితనంతో ఇబ్బంది పడ్డాడు.
ఈ క్రమంలో 65వ ఏట రెండో వివాహం చేసుకోవాలని భావించాడు. తన నిర్ణయం గురించి కుమార్తెలకు తెలిపాడు. వారు కూడా అంగీకరించడంతో.. రెండో వివాహానికి సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో కుమార్తెలు, అల్లుళ్లు, బంధు మిత్రుల సమక్షంలో.. 23 ఏళ్ల యువతిని రెండో వివాహం చేసుకున్నాడు. రుదౌలీ ప్రాంతంలో కామాఖ్యదేశి ఆలయంలో.. రెండో వివాహం చేసుకున్నాడు నఖద్. ఇక పెళ్లి తర్వాత.. ఘనంగా బరాత్ వేడుక కూడా నిర్వహించారు. ఆ సమయంలో నఖద్.. తన ఆరుగురు కుమార్తెలు, బంధువులతో కలిసి హుషారుగా నృత్యాలు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.
భార్య చనిపోయినా సరే.. ఆరుగురు ఆడపిల్లలను పెంచి పెద్ద చేసి వారికి వివాహం చేశాడు నఖద్. వారంతా అత్తారిళ్లకు వెళ్లి.. ఒంటరితనం అనుభవిస్తున్నాడు. తోడు కోసం రెండో వివాహం చేసుకోవడాన్ని ఎవరు తప్పు పట్టడం లేదు. కానీ కుమార్తె వయసున్న యువతిని పెళ్లి చేసుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరి నఖద్ చేసిన పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.