దేశానికి అన్నం పెట్టే రైతు నేడు కష్టాల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాడు. పండించే పంటలకు సరియైన గిట్టుబాటు ధర రాక నష్టాలపాలవుతున్నాడు. వర్షాలు కురవక, పంటలనాశించే తెగుళ్లు ఎక్కువై తీవ్రంగా రైతు నష్టపోతున్నాడు. కాగా ప్రభుత్వం రైతులకు ఓ పథకం ద్వారా రూ. 36000 అందిస్తుంది. ఆ వివరాలు..
రైతులకు అండగా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రకాల పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నాయి. పంటలు పండించేందుకు అవసరమైన వనరులను సమకూరుస్తున్నాయి. సాగు నీరు అందించడం, వ్యవసాయ బావులకు ఉచిత విద్యుత్ అందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇవే కాకుండా రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వాలు ఆర్థిక సాయం చేస్తున్నాయి. కాగా కేంద్ర ప్రభుత్వం ఓ పథకం ద్వారా రైతుకు రూ. 36000 అందించనుంది. రైతు ఆ పథకంలో చేరితే చాలు రూ. 36000 పొందవచ్చును. ఆ పథకం ఏంటి? ఎవరు అర్హులు? అనే విషయాలు మీకోసం..
ఆర్థికంగా చితికిపోతున్న రైతన్నలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తీసుకు వచ్చింది. ఈ పథకం ద్వారా నాలుగు నెలలకొకసారి, ఏడాదికి మూడుసార్లు రూ. 2000 చొప్పున మొత్తం రూ. 6000 రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది. పంట పెట్టుబడికి సాయం అందించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఇవే కాకుండా మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. అదే ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ పథకాన్ని 2019 లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. రైతులు ఈ పథకంలో చేరినట్లైతే వృద్ధాప్యంలో పెన్షన్ పొందవచ్చును. ఎలాంటి సామాజిక భద్రతా పథకాల్లో లేని రైతులకు ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో చేరితే నెలకు రూ. 3000 చొప్పున ఏడాదికి రూ. 36000 పెన్షన్ అందుకోవచ్చు.
అర్హతలు
ఈ పథకానికి అర్హులెవరంటే రెండు హెక్టార్ల లోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు మాత్రమే అర్హులు. 18 ఏళ్ల వయస్సు నుంచి 40 ఏళ్ల లోపు వయస్సు ఉన్న రైతులు ఈ పథకంలో చేరొచ్చు. 40 ఏళ్లు దాటిన వారు అనర్హులు. రైతులు ఈ పథకంలో చేరిన తర్వాత వయస్సును బట్టి ప్రతీ నెలా రూ.55 నుంచి రూ.200 మధ్య పెన్షన్ అకౌంట్‌లో జమ చేయాలి. ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకంలో 18 ఏళ్ల వయస్సులో చేరితే రూ.55 ప్రీమియం, 30 ఏళ్ల వయస్సులో చేరితే రూ.110 ప్రీమియం, 40 ఏళ్ల వయస్సులో చేరితే రూ.200 ప్రీమియం చెల్లించాలి. రైతులు 60 ఏళ్ల వయస్సు వచ్చే వరకు ప్రీమియం చెల్లించాలి.
ప్రయోజనాలు
రైతుకు 60 ఏళ్లు నిడగానే కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతీ నెల రూ.3,000 చొప్పున పెన్షన్ వస్తుంది. ఒక వేళ పెన్షన్ పొందుతున్న రైతు మరణిస్తే జీవిత భాగస్వామికి యాబై శాతం ఫ్యామిలీ పెన్షన్ ఇస్తుంది. జీవిత భాగస్వామి పెన్షన్ వద్దనుకుంటే అప్పటివరకు చెల్లించిన మొత్తం, వడ్డీతో సహా తిరిగి పొందొచ్చు. ఒకవేళ జీవిత భాగస్వామి 50 శాతం ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటే, జీవిత భాగస్వామి మరణించినప్పుడు నామినీకి డబ్బులు వస్తాయి. పాలసీ కొనసాగుతున్న సమయంలో రైతు మరణిస్తే వారి జీవిత భాగస్వామి మిగతా ప్రీమియంలు చెల్లించి పెన్షన్ పొందవచ్చు. ఇక ఈ పథకంలో కొన్నేళ్లు ప్రీమియం చెల్లించిన తర్వాత, రైతులు ప్రధాన మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం నుంచి బయటకు వచ్చేస్తే చెల్లించిన మొత్తం వడ్డీతో సహా తిరిగి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కాబట్టి రైతులు ఈ పథకంలో చేరి వృద్ధాప్యంలో పెన్షన్ అందుకోవచ్చు.