Crime News: ట్యాటూ మోజు ఓ ఇద్దరు యువకుల జీవితాల్ని నాశనం చేసింది. రోడ్లపై ట్యాటూలు వేసే వారి దగ్గర ట్యాటూలు వేయించుకోవటంతో హెచ్‌ఐవీ బారిన పడ్డారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తర ప్రదేశ్‌లోని బరాగావ్‌కు చెందిన 22 ఏళ్ల జయంత్ ఊర్లో జరిగిన జాతరలో చేతిపై ట్యాటూ వేయించుకున్నాడు. రెండు నెలల తర్వాత అతడి ఆరోగ్య పరిస్థితి దిగజారింది. దీంతో ఆసుపత్రిలో చేరాడు. ఎంత చికిత్స చేయించుకున్నా ఫలితం దక్కలేదు. దీంతో డాక్టర్లు హెచ్‌ఐవీ టెస్టు చేయించుకోవాలని సూచించారు.
దీంతో అతడు హెచ్‌ఐవీ టెస్టు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. జయంత్ ఆ రిపోర్టులను నమ్మలేకపోయాడు. తనకు ఇంకా పెళ్లి కాలేదని, ఇప్పటివరకు ఎవరితోనూ శారీరకంగా కలవలేదని వాపోయాడు. ట్యాటూ కారణంగా ఇలా జరిగి ఉండొచ్చని డాక్టర్లు వివరించారు. ఇక, ఇలాంటి ఘటనే నాగ్‌వాన్‌లో చోటుచేసుకుంది. సైఫ్ అలీ అనే వ్యక్తి రోడ్డు పక్కన ట్యాటూ వేయించుకున్నాడు. ట్యాటూ వేయించుకున్న కొద్దిరోజులకే అతడి ఆరోగ్యం క్షీణించింది. దీంతో హెచ్‌ఐవీ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ వచ్చింది.
దీనిపై డాక్టర్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘‘ ఆ ఇద్దరికీ తమకు హెచ్‌ఐవీ ఎలా వచ్చిందో తెలియలేదు. వారికి కౌన్సిలింగ్ ఇవ్వగా ట్యాటూ వేయించుకున్న తర్వాత తమ ఆరోగ్యం క్షీణించిందని చెప్పారు. ట్యాటూ వేసేటప్పుడు హెచ్‌ఐవీ సోకిన వారి సూదిని మరొకరికి వాడటం వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి’’ అని హెచ్చరించారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : మ్యూజియంలో కాల్పులు జరిపిన CISF జవాన్!