దేశంలో ఎంతోమంది చిన్నారులు బోరు బావిలో పడి చనిపోయారని తరుచూ వార్తల్లో వింటూనే ఉన్నాం. వ్యవసాయం కోసం బోర్లు వేయించి నీళ్లు పడకపోవడంతో చాలా మంది వాటిని నిర్లక్ష్యంగా అలాగే వదిలివేస్తుంటారు. కొన్నిచోట్ల నీళ్లు అడుగంటిపోవడంతో నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చి వేయకుండా వదిలి వేస్తుంటారు. వాళ్లు చేసే నిర్లక్ష్యం వల్ల చిన్న పిల్లలు తెలియక వెళ్లి బోరు బావిలో పడిపోతూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఎక్కడో అదృష్టం కొద్ది చిన్నారులు బతికిపోతున్నారు. శనివారం రెండేళ్ల బాలిక ఆడుకుంటూ వెళ్లి బోరు బావిలో జారి 20 అడుగుల లోతులో కూరుకు పోయింది. ఈ ఘటన గుజరాత్ లోని జామ్ నగర్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
పెద్దలు చేసే నిర్లక్ష్యానికి పిల్లలు బలి అవుతుంటారని ఎన్నో సంఘటనలు రుజువు చేశాయి. ముఖ్యంగా బోరు బావి విషయాల్లో కొంతమంది నిర్లక్ష్యం చిన్నారుల పాలిట శాపంగా మారుతుంది. బోరు బావి నిరుపయోగంగా ఉంటే వాటిని పూడ్చి వేయాలని ప్రభుత్వ అధికారులకు ప్రజలకు ఎన్నిసార్లు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి చెప్పినా వినిపించుకోకపోవడం వల్ల ప్రమాదాలు పదే పదే పునరావృతం అవుతున్నాయి. తాజాగా గుజరాత్ లోని జామ్ నగర్ జిల్లాలో ఓ వ్యవసాయ క్షేత్రంలో శనివారం రెండు సంవత్సరాల బాలిక బోరు బావిలో జారి 20 అడుగుల లోతులో కూరుకు పోయింది.
తల్లిదండ్రులు, స్థానికులు ఇచ్చిన సమాచారం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఉదయం 11 గంటల నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. అన్ని విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని జామ్ నగర్ తాలూక అభివృద్ది అధికారి సర్వయ్య తెలిపారు. బోరు బావి మొత్తం లోతు దాదాపు 200 అడుగు ఉంటుందని అన్నారు. నిరుపయోగంగా ఉన్న బోరు బావులను పూడ్చివేయాలని ప్రజలకు ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయని ఆయన అన్నారు.