సీమా హైదర్ కేసులో ఇన్వాల్వ్ అయిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమంగా భారత్ లోకి చొరబడిన సీమాకి ఆ ఇద్దరూ సహాయం చేయడమే కాకుండా చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు విచారణలో తేలింది.
ఆన్లైన్ పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన ప్రియుడ్ని పెళ్లి చేసుకునేందుకు పాకిస్తాన్ నుంచి భారత్ కి వచ్చిన ప్రియురాలు సీమా హైదర్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. సచిన్ ని వివాహం చేసుకునేందుకే వచ్చానని సీమా చెబుతుంది. అయితే అక్రమంగా భారత్ లోకి చొరబడిన కారణంగా ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆమెకు పాకిస్తాన్ ఆర్మీతో సంబంధాలు ఉన్నాయని, భారత్ కి వచ్చేందుకు ఆమెకు ఇక్కడ ఉన్న వారే ఎవరో సహాయం చేశారని పోలీసులు అనుమానించారు. ఇందుకు సంబంధించి ఎలాంటి వాస్తవాలు బయటకు రాలేదు. అయితే ఆమె భారత్ కి వచ్చాక ఇద్దరు వ్యక్తులు సహాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఈమె అక్రమంగా భారత్ లోకి ప్రవేశించిందని యూపీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆమె భారతీయురాలినని.. ఇక్కడే ఉండిపోతానని చెప్పినప్పటికీ పోలీసులు పలు అనుమానాల నేపథ్యంలో ఆమెను విచారిస్తున్నారు. ఆమెతో పాటు సచిన్ ను, ఆయన తండ్రిని కూడా విచారిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి సీమా హైదర్ కి సహాయం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. సీమా హైదర్ కి నకిలీ పత్రాలు సృష్టించిన ఇద్దరు వ్యక్తులను నోయిడా పోలీసులు అరెస్ట్ చేశారు. పవన్, పుష్పేంద్రలను ఉత్తర ప్రదేశ్ లోని బులంద్షహర్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి 15 నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో వీరిద్దరికీ పెద్ద స్థాయిలో నకిలీ పత్రాల రాకెట్ లో ప్రమేయం ఉన్నట్లు తేలింది.
సీమా హైదర్ గ్రేటర్ నోయిడాకి వచ్చినప్పుడు పవన్, పుష్పేంద్రలతో పరిచయం ఏర్పడింది. ఆ సమయంలో సీమాతో పాటు సచిన్ కూడా ఉన్నాడు. వివాహం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇద్దరూ కలిసి బులంద్షహర్ బయలుదేరారు. బులంద్షహర్ లో పుష్పేంద్ర, పవన్ లు జన్ సేవ కేంద్ర అనే పబ్లిక్ సర్వీస్ సెంటర్ ను నడుపుతున్నారు. ఈ సెంటర్ ను అడ్డుపెట్టుకుని నకిలీ ఆధార్ కార్డులు, నకిలీ గుర్తింపు కార్డులను సృష్టిస్తున్నారు. తమ వివాహం కోసం సచిన్, సీమా హైదర్ లు నకిలీ పత్రాల కోసం పవన్, పుష్పేంద్రలను సంప్రదించారు. సీమా హైదర్ కి నకిలీ ఆధార్ కార్డులను సృష్టించినట్లు విచారణలో తేలింది. ఈ నకిలీ కార్డుల తయారీ కోసం ఉపయోగించిన సామాగ్రిని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.