సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ తీసుకుంటున్న చర్యలు, వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. బిలియనీర్ ఎలన్ మస్క్ గుప్పిట్లోకి వెళ్లాక ఆ సంస్థ వేస్తున్న ప్రతి అడుగుపై విమర్శలే వినిపిస్తున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ ఈమధ్య వరుసగా విమర్శల పాలవుతోంది. ఇటీవల దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖుల ఖాతాలకు బ్లూటిక్ తొలగించింది ట్విట్టర్. నిజమైన సెలబ్రిటీల అకౌంట్స్‌ను గుర్తించేందుకు ఉపయోగపడే బ్లూ టిక్‌ను.. నెలవారీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే కేటాయిస్తామని ట్విట్టర్ కరాఖండీగా చెప్పింది. సాధారణ యూజర్లు కూడా కావాలంటే బ్లూటిక్ పొందేలా సబ్స్క్రిప్షన్ ప్లాన్లను రూపొందించింది. ఎవరైతే డబ్బులు చెల్లించరో వారి టిక్ మార్క్‌లను తీసేస్తూ వస్తోంది. కాంగ్రెస్ సీనియర్లు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ వాద్రా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్, బాలీవుడ్ స్టార్లు దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా తదితరుల అకౌంట్స్‌కు బ్లూ టిక్ మార్క్‌లను ట్విట్టర్ తీసేసింది.
బ్లూ టిక్ వివాదం చల్లారక ముందే ట్విట్టర్ మరో కాంట్రవర్సీకి తెరలేపింది. భారత్‌లోని ప్రముఖ వార్తా సంస్థలైన ఎన్డీటీవీ, ఏఎన్ఐల అకౌంట్స్‌ను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. తమ ఖాతాను బ్యాన్ చేసిన విషయాన్ని ఏఎన్ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ పర్సనల్ అకౌంట్ ద్వారా తెలిపారు. 7.6 మిలియన్ల ఫాలోవర్లు ఉన్న దేశంలోని అత్యంత పెద్ద న్యూస్ ఏజెన్సీ అకౌంట్‌ను బ్లాక్ చేయడం సరికాదని స్మిత మండిపడ్డారు. 13 ఏళ్ల లోపు వయసు నిబంధన (సోషల్ మీడియా సెన్సార్ రూల్)ను కారణంగా చూపుతూ ట్విట్టర్ తమ గోల్డ్ టిక్ తీసేసిందని ఆమె చెప్పుకొచ్చారు. ఏఎన్ఐకు అందిన మెయిల్ ప్రకారం.. ట్విట్టర్లో ఖాతాకు సంబంధించి 13 ఏళ్ల వయసు నిబంధనను ఏఎన్ఐ ఉల్లంఘించిందట. ఇక, ఎన్డీటీవీ అకౌంట్‌ను ట్విట్టర్ ఎందుకు బ్లాక్ చేసిందనే దానికి స్పష్టమైన కారణాలు ఇంకా తెలియరాలేదు.
ANI and NDTV, top Indian news outlets, were suspended from Twitter after being misidentified as ‘children’ under 13. pic.twitter.com/wq9CIUuphs
— DealzTrendz (@dealztrendz) April 29, 2023