అన్నాదమ్ములు అనగానే ప్రతి ఒక్కరికి రామలక్ష్మణులే గుర్తుకు వస్తారు. కానీ నేటి సమాజంలో అలాంటి అపూర్వ సోదరులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి కొందరు సోదరులు.. పెళ్లై తమకంటూ ఓ కుటుంబం ఏర్పడినా కూడా ఎంతో అన్యోన్యంగా కలిసి జీవిస్తుంటారు. అచ్చం అలానే ఓ కవలలు.. ఒకరిపై మరొకరు ఎంతో ప్రేమ, ఆప్యాయతను చూపించుకునే వారు. వారి పరిస్థితులు కారణంగా ఒకరు గుజరాత్ లో ఉండగా.. మరొకరు రాజస్థాన్ లో ఉంటున్నారు. ఇద్దరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. దూరంగా ఉన్నా.. నిత్యం ఇద్దరు పలకరించుకుంటారు. కానీ విధి ఆడిన వింతనాటకంలో గంటల వ్యవధిలో ఆ సోదరులిద్దరు అనుమానస్పద రీతిలో మరణించారు. 900 కి.మీ దూరంలో ఉన్నప్పటికి ఒకే రకంగా గంటల వ్యవధిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
రాజస్థాన్ లోని బార్మర్ జిల్లాలోని సర్నోకాతలా గ్రామంలో సుమేర్, సోహన్ సింగ్ (25) అనే కవలలు జన్మించారు. రామలక్ష్మణుల లాగా ఉన్నారని ఆ తల్లిదండ్రులు ఎంతో సంబర పడ్డారు. అలానే ఇద్దరి బాగా చదవించి ప్రయోజకులను చేయాలని ఆ తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. సుమేర్ కు చదువు సరిగ్గా రాకపోవడంతో మధ్యలోనే ఆపేశాడు. అనంతరం గుజరాత్ రాష్ట్రం సూరత్ లో టైక్స్ టైల్ సిటీలో పనిచేస్తున్నాడు. సోహన్ సింగ్ జైపూర్ నివాసం ఉంటూ గ్రేడ్-2 టీచర్ రిక్రూట్ మెంట్ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నాడు. సుమేర్ పనిచేస్తూ సోహన్ ను చదివిస్తున్నాడు. అతడి పుస్తకాలు, కోచింగ్ కోసం సుమేర్ డబ్బులు పంపిస్తుండే వాడు. తాను చదువుకోలేపోయానని, తన సోదరుడినైనా బాగా చదవించాలని సుమేర్ ఆశపడ్డాడు.
అలానే సోదరుడి కష్టాన్ని వృథా కానివ్వకూడదని, కష్టపడి చదివి టీచర్ జాబ్ కొట్టాలని సోహన్ సింగ్ పట్టుదలతో ఉన్నాడు. ఇలా అంతా హాయిగా సాగుతున్న తరుణంలో విధి వారిపై కన్నెర్ర చేసింది. బుధవారం సూరత్ లో నివాసం ఉంటున్న సుమేర్.. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలిసి సుమేర్ కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. సోహన్ సింగ్ కూడా సోదరుడి మృతిని జీర్ణించుకోలేక పోయారు. గురువారం తెల్లవారు జామున నీళ్లు తెచ్చేందుకు సమీపంలోని ట్యాంక్ వద్దకు వెళ్లాడు. ఎంతసేపటికి సోహన్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారు. సోహన్ మృతదేహం ట్యాంకులో కనిపించడంతో అందరు షాకయ్యారు.
చేతికి అందివచ్చిన ఇద్దరు కుమారులు గంటల వ్యవధిలో మరణించడంతో ఆ తల్లిదండ్రులు గుండెపగిలేలా రోదిస్తున్నారు. సోహన్ పొరపాటున కాలుజారి వాటర్ ట్యాంక్ లో పడిపోయాడా? లేదా ఆత్మహత్య చేసుకున్నాడా? అనే విషయంలో స్పష్టత రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. 900 కిలో మీటర్ల దూరంలో ఉన్న సోదరులిద్దరు గంటల వ్యవధిలో ఇలా మృతి చెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. మరీ.. ఈ విషాదకరమైన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.