18 ఏళ్లకు ఓటు హక్కే ఉండదు చాలా మందికి. ఆ వయసులో జీవితం పట్ల సరైన అవగాహన ఉండదు. ఆట, పాటలు వంటివి తప్పితే వేరే ఆలోచన ఉండదు. అలాంటిది రాజకీయమనే మైదానంలో అడుగుపెట్టి.. 21 ఏళ్లకే కార్పొరేటర్ గా గెలిచి.. ఇప్పుడు 23 ఏళ్లకే మేయర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించిన ఒక యువతి గురించి తెలుసుకోబోతున్నారు.
యువకులు రాజకీయాల్లోకి రావాలి, రావాలి అంటారు. కానీ యువకులు మాత్రం ఎందుకొచ్చిన రాజకీయాలు అని చెప్పి రావడం లేదు. కానీ నిండా పాతికేళ్ళు కూడా లేని ఒక యువతి రాజకీయాల్లో అడుగుపెట్టడమే కాకుండా అతి చిన్న వయసులో మేయర్ గా గెలుపొంది చరిత్ర సృష్టించారు. త్రివేణి సూరి (23) అతి చిన్న వయసులో మేయర్ గా ఎంపికయ్యారు. కర్ణాటక బళ్లారి నగర కార్పొరేషన్ మేయర్ పదవికి ఎన్నికైన త్రివేణి సూరి చరిత్ర సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఈమె పారామెడికల్ డిగ్రీ పట్టా పొందారు. మేయర్ ఎన్నికల్లో 28 ఓట్లు సాధించి విజేతగా నిలిచారు. తన ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి నాగరత్నమ్మ సభలో 39 మంది కార్పొరేటర్లు ఉన్నా కూడా 16 ఓట్లు మాత్రమే సాధించగలిగారు.
సభలో 44 మంది ఉంటారు. ఓటర్లలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలు ఉంటారు. బీజేపీ నుంచి 39 మంది సభలో ఉన్నా కూడా నాగరత్నమ్మ 16 ఓట్లు మాత్రమే గెలుచుకున్నారు. బీజేపీకి 13 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ.. మేయర్ ఎన్నికల్లో మేయర్ పదవిని గెలుచుకునేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. అయితే 21 స్థానాలతో ఉన్న కాంగ్రెస్ కు ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలికారు. త్రివేణి సూరి 18 ఏళ్లకే రాజకీయాల్లో అడుగుపెట్టారు. 21 ఏళ్లకే కార్పొరేటర్ అయ్యారు. మైసూరు సిటీ కార్పొరేషన్ మేయర్ గా గతంలో 31 ఏళ్లకే గెలుపొందిన తస్నీం బానో పేరు మీద ఉన్న రికార్డులను త్రివేణి సూరి బ్రేక్ చేశారు. 23 ఏళ్లకే మేయర్ గా ఎన్నికై చరిత్ర సృష్టించారు.
2018లో ఈమె తల్లి సుశీలా బాయ్ ఏడాది కాలానికి మేయర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత తమ కుటుంబం నుంచి రెండవ వ్యక్తి త్రివేణి సూరి మేయర్ గా ఎన్నికవ్వడం జరిగింది. రాజకీయాల్లోకి యువకులు రావాలి అని మాట వరసకు అంటారని అనుకుంటాం. కానీ నిజంగానే యువకులు వస్తే రానిస్తారా? అందులోనూ ఆడపిల్లలు వస్తే రానిస్తారా? అన్న ప్రశ్నకు సమాధానమే ఈ యువతి. వాళ్ళు రానిచ్చారు, ఈమె రాణిస్తున్నారు. యువకులను సీనియర్లు రానిస్తే, వాళ్ళు అద్భుతమైన పనితీరుతో రాణిస్తారని ఈ సంఘటన రుజువు చేసింది. మరి ఓటు హక్కు ఉన్న వయసులో ఓటు వేయించుకునే స్థాయి ఉన్న రాజకీయాల్లో అడుగుపెట్టి.. 21 ఏళ్లకే కార్పొరేటర్ గా ఎన్నికై.. ఇప్పుడు 23 ఏళ్లకే మేయర్ గా గెలుపొంది చరిత్ర సృష్టించిన ఈ యువతిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.