మన దేశంలో ఇచ్చే అత్యున్నత పురస్కారాలుగా పద్మ అవార్డులను చెప్పొచ్చు. ఏదైనా రంగంలో విశేష ప్రతిభ కనబర్చి, విజయాలు సాధించిన వారికి పద్మ అవార్డులు ఇస్తుంటారు. అలాంటి పద్మ పురస్కారానికి ఎంపికయ్యారు జోధయ్య బాయి. మధ్యప్రదేశ్‌లోని ఉమేరియా జిల్లా, లోర్హా గ్రామానికి చెందిన 84 ఏళ్ల జోధయ్య బాయి.. ఈ సంవత్సరం దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీకి సెలెక్ట్ అయ్యారు. 10 నెలల కింద నారీ శక్తి అవార్డును కూడా ఆమె అందుకున్నారు. అయితే సాధారణ కూలీ నుంచి పద్మ శ్రీ పురస్కారానికి ఎంపికయ్యేంత వరకు జోధయ్య బాయి ప్రయాణంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు ఉన్నాయి. చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న ఆమె.. పొట్టకూటి కోసం కూలీ పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే వారు. కళపై ప్రేమతో 70 ఏళ్ల వయసులో ఆమె చిత్రకారిణిగా మారారు. అరుదైన కళకు ప్రాణం పోసి ఎనిమిది పదుల వయసులో ఎన్నో అవార్డులు, ప్రతిష్ఠాత్మక పురస్కారాలు అందుకున్నారు.
కళారంగంలో విశిష్ఠ సేవలు అందిస్తున్నందుకు జోధయ్య బాయి ప్రతిభను గుర్తించి అవార్డులు, పురస్కారాలు లభిస్తున్నాయి. కానీ ఆమెకు ఉండటానికి ఓ పక్కా ఇల్లు మాత్రం లేదు. నారీ శక్తిని అందుకున్న సమయంలో ప్రధాని మోడీని కలిసిన జోధయ్య బాయి.. పక్కా ఇల్లు లేక పడుతున్న అవస్థలను చెప్పి ఇల్లు ఇప్పించాలని కోరారు. దీనికి మోడీ కూడా సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు. అయితే తనకు ఇప్పటిదాకా పక్కా ఇల్లు మాత్రం రాలేదన్నారు. ఇల్లు మంజూరు చేయాలని ఉమేరియాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగానని.. భోపాల్‌కు వెళ్లినా తన పని జరగలేదన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల్లో తన పేరు లేదని అధికారులు అంటున్నారని జోధయ్య పేర్కొన్నారు. ‘నాకు వంటగ్యాస్ రాయితీ ఉంది. ఇతర పథకాలు కూడా అందుతున్నాయి. కానీ పక్కా ఇల్లు మాత్రం లేదు. ఇప్పటికీ మట్టితో కట్టిన పూరింట్లోనే ఉంటున్నా. దయచేసి నాకు ఇల్లు కేటాయించాలని రాష్ట్ర సీఎం, దేశ ప్రధానిని చేతులెత్తి అభ్యర్థిస్తున్నా’ అని జోధయ్య బాయి ఆవేదన వ్యక్తం చేశారు.