ఒక ఆలయ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడు మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..
దేవుడి దర్శనం కోసం ఆలయానికి వెళ్లారు. మొక్కు చెల్లించుకుని, గుడిలో జరిగే వేడుకలు చూసి వద్దామనుకుని వెళ్లారు. కానీ మృత్యువు వారిని కబళించింది. మహారాష్ట్రలోని ఓ దేవాలయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణంలో భారీ వృక్షం కూలి ఏడుగురు చనిపోయారు. ఈ దుర్ఘటన అకోలా జిల్లాలోని, బాబూజీ మహరాజ్ దేవాలయంలో ఆదివారం రాత్రి జరిగింది. ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో బాబూజీ మహరాజ్ టెంపుల్లో మహా హారతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. అకోలా జిల్లాలో కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, ఈదురుగాలుల కారణంగా బాబూజీ ఆలయ ప్రాంగంణలో ఉన్న 100 ఏళ్ల నాటి ఒక భారీ వేప వృక్షం తీవ్రంగా దెబ్బతింది.
బాబూజీ ఆలయంలో ఆదివారం రాత్రి పూజలు జరుగుతున్న టైమ్లో ఆ వేప వృక్షం దగ్గర్లోని రేకుల షెడ్డు మీద పడిపోయింది. దీంతో షెడ్డు కుప్పకూలి దాని కింద కొంతమంది భక్తులు చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఎమర్జెన్సీ సిబ్బందితో ఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకున్నారు. వెంటనే వారు సహాయక చర్యలు చేపట్టారు. బుల్డోజర్ సాయంతో వేప వృక్షాన్ని తొలగించారు. శిథిలాల కింద చిక్కుకొని ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు తమ సర్కారు ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఫడ్నవీస్ చెప్పారు.
A massive old neem tree fell on the tin shed of Babuji Maharaj Mandir Sansthan after heavy rain lashed #Akola district. https://t.co/s3xTherBmm
— IndiaToday (@IndiaToday) April 10, 2023