ఈ మద్యకాలంలో డబ్బుకు సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా డిజిటల్ పరంగా జరుగుతున్నాయి. అలాంటి సమయంలో కొన్నిసార్లు పొరపాటున తాము పంపించాల్సిన డబ్బు వేరే వ్యక్తి ఖాతాల్లోకి వెళ్లడం.. బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేయడం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు అనుకోకుండా ఖాతాదారుల్లో లక్షలు, కోట్లు వచ్చిపడుతుంటాయి. ఓ వ్యక్తికి వందలు… వేలు.. లక్షలు కాదు ఏకంగా ఆరు వేల కోట్లు జమ అయ్యాయి. వివరాల్లోకి వెళితే..
బిహార్‌లోని లఖీసరాయ్ జిల్లా బర్హియా గ్రామానికి చెందిన సుమన్ స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేస్తుంటాడు. ఆయనకు కోటక్ సెక్యూరిటీస్ మహీంద్రా బ్యాంకులో డీమ్యాట్ ఖాతా ఉంది. వారం రోజుల క్రితం సుమన్ ఖాతాలో రూ.6,833.42 కోట్లు జమ అయ్యాయి. ఇటీవల తనకు కొంత డబ్బు అవసరం ఉండటంతో ఖాతాలో ఎంత ఉందని చెక్ చేసుకున్నాడు.. అంతే ఒక్కసారే ఖంగు తిన్నాడు.
ఇంత డబ్బు తనకు ఎక్కడ నుంచి జమ అయ్యాయో అర్థం కాలేదు. పొరపాటున నగదు బదిలీ అయిందనుకున్నా.. వారం క్రితం జమ అయిన ఆరువేల కోట్లు ఇప్పటికీ తన ఖాతాలో అలాగే ఉన్నాయని సుమన్ అంటున్నాడు. మరోవైపు దీనికి సంబంధించి పూర్తి సమాచారం తమకు అందలేదని సూర్యగఢ స్టేషన్ హౌస్ అధికారి చందన్ కుమార్ తెలిపారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.