నేటికాలంలో అబ్బాయికు పెళ్లిళు కావడం గగనంగా మారింది. మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వెనకాల గట్టి ఆస్తులు.. ఇలా చాలా చూసి మరీ యువకుడిని ఎంచుకుంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు. అలాంటి అర్హతలు ఉన్న అబ్బాయిలకి ఈజీగానే పెళ్లిళ్లు అవుతున్నాయి. అయితే సామాన్య యువకులకి అమ్మాయి దొరకాలంటే వారి కుటుంబ సభ్యులు చెప్పులు అరిగేలా తిరగాలి. కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు అయితే అమ్మాయిల కోసం చూసి చూసి.. విసుగొచ్చి చూడటం మానేస్తారు. కొందరు అబ్బాయిలు ఆపాసోపాలు పడి అతి కష్టం మీద చివరికి పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం యువకులు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే.. ఒకడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. అది కూడా కేవలం 28 ఏళ్లకే ఈ పెళ్లిళ్లన్ని చేసుకున్నాడు. ఈ వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన అసబుల్ మొల్లా(28) పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేశాడు. మూడు పదుల వయసు రాకముందే ఈ ఘనుడు 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. బిహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా 24 మంది యువతలను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. గుర్తింపు కార్డులు పేరు ఊరు మార్చుకుంటూ యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. వారి నుంచి డబ్బులు, నగదు తీసుకుని పరారయ్యాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సాగర్దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
గతంలో యువతులను మోసం చేసినట్లే.. ఈమె నుంచి డబ్బులు, సొమ్ము తీసుకుని పరారయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఏట్టకేలకు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఒక పెళ్లికే దిక్కు లేకుంటే.. 24 పెళ్లిళ్లా? ఏందిరా సామీ నీ అరాచకం’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి వాడికి కఠినమైన శిక్ష వేస్తే..భవిష్యత్తులో ఇలాంటి మోసలు జరగవని మరికొందరు కామెంట్స్ చేశారు.