ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన ఘట్టం. అందుకే ఆ రోజు జరిగిన కార్యక్రమాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. వధువరుల బంధువులు, స్నేహితులు పెళ్లిలో తెగ సందడి చేస్తారు. అలానే ఈ పెళ్లిలో అలంకరణలు, ఉత్సవాలు, ఊరేగింపులు..వంటివి ఎంతో ఘనంగా చేస్తుంటారు. అలానే అప్పగింతల సమయంలో పెళ్లి కూతుర్ని.. అత్తింటి వారు తమ వాహనంలో తీసుకెళ్తుంటారు. అయితే ఓ వరుడు తన వివాహం అందరికి గుర్తుండిపోయే, ఆశ్చర్యపరిచే పని ఒకటి చేశాడు. వధువును హెలికాప్టర్‌లో సొంత గ్రామానికి తీసుకెళ్లి.. ఆమె కొరికను నిజం చేశాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఈ పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఉత్తర్ ప్రదేశ్ రూడ్కీలోని చావ్ మండీకి చెందిన సంజయ్ కుమార్, బిజ్నోర్ జిల్లాకు చెందిన నేహా దీమాతో కొంతకాలం క్రితం వివాహం నిశ్చమైంది. డిసెంబర్ 2న బిజ్నోర్ చాంద్ పూర్ లో వీరి వివాహం జరిగింది. అయితే తనకు హెలికాప్టర్ ఎక్కాలని ఉందని పెళ్లికి ముందే వరుడికి తన కొర్కెను వధువు తెలిపింది. అతడు కూడా వధువు కొర్కెను నెరవేర్చాలని భావించాడు. ఈ క్రమంలో వరుడు ఒక హెలికాప్టర్ ను అద్దెకు తీసుకున్నాడు. భార్యతో కలసి హెలిప్యాడ్ వద్ద ఉన్న హెలికాప్టర్ వద్దకు వెళ్లాడు. దానిని చూసిన వధువు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైంది. వధువును హెలికాప్టర్ లో వరుడు తన ఇంటికి తీసుకొచ్చాడు. వరుడు చేసిన ఈ పనికి వధువు కుటుంబ సభ్యులతో పాటు పెళ్లికి వచ్చిన బంధువులు ఆశ్చర్యపోయారు. అంతేకాక హెలికాప్టర్ లో నుంచి వధువు దిగుతున్న సమయంలో అక్కడి స్థానికులు భారీగా తరలివచ్చారు. దీంతో చావ్ మండిలో సందడి నెలకొంది. ఆ ప్రాంతంలో మొదటి సారిగా హెలికాప్టర్ దిగడంతో..దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి జనాలు సైతం భారీగా తరలి వచ్చారు. సంజయ్ కుమార్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త అంటే ఇలా ఉండాలి అని కొందరు యువతులు కామెంట్స్ చేస్తున్నారు. ‘నీకు ముందుంది మొసళ్ల పండగ గురూ!’ అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.