ఈ సృష్టిలో వెలకట్టలేనిది అంటూ ఏదైనా ఉంది అంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే. కారణం బిడ్డ యోగ క్షేమాల కోసం ఆమె చేసే త్యాగాలకు లెక్కే ఉండదు. తాను తిని తినక బిడ్డలకు కడుపు నింపుతుంది కన్నతల్లి. వారి సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది. అంతేకాక తన పిల్లలకు ఏదైన ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు తన ప్రాణాలు అడ్డు వేసి మరీ కాపాడుకుంటుంది. అలానే తల్లి ప్రేమకు హద్దులు ఉండవు. బిడ్డ పెరిగి పెద్దవాడైనా, ఓ ఇంటి వాడైనా, ఓ బిడ్డకు తండ్రైనా కూడా తల్లికి పసివాడిగానే కనిపిస్తాడు. అలా బిడ్డలకు ఎలాంటి ఆపద వచ్చిన మాతృమూర్తి తాను అడ్డుగా నిలబడి ప్రాణాలను కాపాడుతుంది. బిడ్డలను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన తల్లుల ఎందరో ఉన్నారు. అలాంటి ఘటనే తాజాగా కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ తల్లి, కొడుకు పట్టాలు దాటుతుండగా గూడ్స్ రైలు వచ్చింది. తప్పించుకునే వీలు లేకపోవడంతో తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్య నక్కి కూర్చుని ప్రాణాలు కాపాడుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటక రాష్ట్రం కలబుర్గి రైల్వే స్టేషన్ లో తన కొడుకుతో కలిసి ఓ మహిళ పట్టాలు దాటుతోంది. ఎదురుగా ఉన్న మరో ప్లాట్ ఫామ్ పైకి వెళ్లేందుకు ఇద్దరూ పట్టాలపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్నారు. అలానే వారు వెళ్లాల్సిన ప్లాట్ ఫామ్ సమీపంలోకి వెళ్లి..పైకి ఎక్కేందుకు ప్రయత్నిస్తుండగా గూడ్స్ రైలు అటుగా వచ్చింది. అది గమనించిన వాళ్లు త్వరగా పైకి ఎక్కే ప్రయత్నం చేశారు. ఎక్కే వీళ్లులేక పోవడంతో దూసుకొస్తున్న గూడ్స్ రైలు నుంచి తప్పించుకునేందుకు తల్లీకొడుకులు ప్రయత్నించారు. ఇద్దరూ పట్టాలు, ఫ్లాట్ ఫామ్ మధ్య ఉన్న కొంచెం ఖాళీ ప్రదేశంలో ఊపిరి బిగబట్టి కదలకుండా నక్కి కూర్చున్నారు. తనకు ఏమైన పరువాలేదు.. బిడ్డకు ఏమీ కాకుండదని తన ఒడిలో దాచుకుంది.
అలా కొద్ది నిమిషాల పాటు వారిద్దరు గూడ్స్ రైలుకి, ఫ్లాట్ ఫామ్ కు మధ్య నక్కి నక్కి కూర్చున్నారు. ఈ హఠాత్తు పరిణామంతో అక్కడే ఉన్న తోటి ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ఆ ఫ్లాట్ ఫామ్ వద్ద గుమిగూడి.. ఆ తల్లీకొడుకులకు ఏమైందోనని టెన్షన్ పడ్డారు. అక్కడ ఉన్నవారిలో చాలా మంది ఆ తల్లీబిడ్డలపై ఆశలు వదిలేశారు. రైలు వెళ్లే వరకు అందరూ ఊపిరి బిక్క పట్టుకును చూశారు. రైలు వెళ్లిపోయాక లేచి నిలబడ్డ కొడుకు తల్లిని హత్తుకుని అలాగే ఉండిపోయాడు. వారు సురక్షితంగా బయటపడటంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తల్లి కూడా షాక్ నుంచి తేరుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.