ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పుణ్యమా అని ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగినా క్షణాల్లో తెలిసిపోతున్నాయి. ఇలా సాంకేతిక ప్రపంచంలో అనేక వార్తలు క్షణాల వ్యవధిలో ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. ఇలా వచ్చే వార్తాల్లో కొన్ని మనకు చాలా ఆశ్చర్యానికి కలిగిస్తుంటాయి. మరికొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉంటాయి. ఇప్పటికే జీవులకు సంబంధించి అనేక వింతలు విశేషాలు మనం చాలా చూశాం. తాజాగా మరో వింత చోటుచేసుకుంది. ఏడాది వయస్సున్న దూడ పాలు ఇస్తుంది. అది కూడ ఎలాంటి సంతానం కలగకుండానే రోజూ లీటర్ల కొద్ది పాలు ఇస్తుంది. ఈ వింత దృశ్యం ఉత్తర్ ప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఈ దూడను చూసేందుకు స్థానికంగా ఉండే వారు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. ఆ దూడను తమ ఇంటి దేవతగా భావించి.. పూజలు చేస్తున్నారు కుటుంబ సభ్యులు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం గోరఖ్ పూర్ జిల్లా ఖోరాబర్ లోని జార్వా కు చెందిన గిరి నిషాద్.. తన కుటుంబతో కలిసి వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తోన్నాడు. వ్యవసాయంతో పాటు పశువుల పోషణ కూడా గిరి నిషాద్ చేస్తుంటాడు. 15 రోజుల క్రితం గిరి.. తన ఊరికి సమీపంలోని మరో గ్రామంలో ఓ దూడను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చాడు. వారం రోజులు గడిచిన తరువాత ఆ దూడ పాలు ఇవ్వడం కుటుంబ సభ్యులు గమనించారు. ఇక రోజులు గడిచే కొద్ది ఆ దూడ ఎక్కువ పాలు ఇస్తూ వచ్చింది. ప్రస్తుతం రోజుకు 4 లీటర్ల పాలు ఇస్తుందని ఆ దూడ యజమాని గిరి చెప్పారు. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఆ సంతానం లేకుండానే ఆ దూడ పాలు ఇస్తుంది. దీంతో స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఏడాది వయస్సున్న దూడ పాలు ఇవ్వడం ఏంటని, ఇది అద్భుతమని స్థానికులు అంటున్నారు. ఈ వింతను చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల వారు కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. అక్కడి వెళ్లిన వాళ్లు.. నమ్మకం కుదరక వారే స్వయంగా దూడ నుంచి పాలు తీస్తున్నారు. దూడ పాలు ఇచ్చేందుకు కొత్తవారికి కూడా సహకరిస్తుంది. ఆ దూడను గిరి కుటుంబ సభ్యులు నందిగా భావించి పూజలు చేస్తున్నారు. అయితే మరొక వైపు ఈ విషయం చాలా గ్రామాలకు వ్యాపించింది. ఈ క్రమంలో పశువైద్యుడు డాక్టర్ యోగేష్ వచ్చి ఆ దూడను పరిశీలించారు. ” జన్యుపరమైన, హార్మోన్ల మార్పులు కారణంగా ఇలాంటి ఘటనలు జరుగుతాయని ఆయన తెలిపారు.
గర్భం లేకుండా పాలు ఇవ్వడం, అలానే బిడ్డకు జన్మనిచ్చే ప్రక్రియాలో కూడా హర్మోన్ల మార్పు కారణంగా జరుగుతాయని పశు వైద్యుడు తెలిపారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..”గతంలో ఈ దూడ ఏదైన ఆరోగ్య సమస్యకు గురైనప్పుడు.. చికిత్సలో భాగంగా వాడిన మందులు కూడా ప్రభావం చూపించవచ్చు. అలానే ఈ దూడ ఇచ్చే పాలను ఉపయోగించే విషయంలో వైద్యులను సంప్రదించడం అవసరం. ఇవి వాడటం వలన ఏమైనా సమస్యలు ఉంటాయా? ఉండవా? అనే స్పష్టతను వైద్యుల నుంచి తెలుసుకోవడం మంచిది” అని డాక్టర్ యోగేష్ అన్నారు.