ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణ్ ఖేడ్ లోని కస్తూరీ బా పాఠశాలకు చెందిన 35 పిల్లలు అల్పహారం తిని అస్వస్థత గురైన సంగతి తెలిసిందే. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పికి తాళలేక పిల్లలు అల్లాడిపోయారు. ఇలాంటి ఘటనలు తరచూ అక్కడకక్కడ జరుగుతూనే ఉంటాయి. తాజాగా మధ్యాహ్న భోజనం చేసిన 200 మంది విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. బల్లి పడినట్లు అనుమానిస్తున్న భోజనాన్ని ఉపాధ్యాయులు బలవంతగా తినిపించడంతో విద్యార్ధులు అస్వస్థకు గురైనట్లు సమాచారం. ఈ ఘటన బీహార్ లోని భాగల్పూర్ లో చోటు చేసుకుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
బీహార్ రాష్ట్రం భాగల్పూర్లోని ఓ పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో 8వ తరగతి విద్యార్ధి ప్లేట్ లో చనిపోయిన బల్లి కనిపించింది. దీంతో ఈ విషయాన్ని విద్యార్ధులు ప్రధానోపాధ్యాయుడి దృష్టికి తీసుకెళ్లారు. కానీ అది బల్లి కాదని, వంకాయని ఆయన విద్యార్ధులకు చెప్పాడు. అంతే కాక పాఠశాలలోని సిబ్బంది కూడా విద్యార్ధులను ఆహారం తినాలని బలవంతం చేశారు. ఆ ఆహారం తిన్న తరువాతే విద్యార్ధులు అస్వస్థకు గురయ్యారు. మధ్యాహ్నం భోజనం చేసిన అనంతరం ట్యూషన్ క్లాసులకు వెళ్లగా.. మొదట ఒక విద్యార్ధికి వాంతులయ్యాయి. ఆ తర్వాత కొంత సమయానికి మిగిలిన విద్యార్ధులు కూడా అనారోగ్యానికి గురయ్యారు. ఇలా దాదాపు 200 మంది విద్యార్ధులు అస్వస్థకు గురైనట్లు సమాచారం. దీంతో పాఠశాల సమీపంలోని ఓ ఆసుపత్రికి విద్యార్ధులను తరలించారు.
స్థానికులు పోలీసులకు సమాచారం అందించడటంతో ఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనను విద్యాశాఖ తీవ్రంగా పరిగణించింది. పోలీసులు కూడా ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు. ప్రధానోపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులతో పాటు వంట సిబ్బంది తప్పు చేసినట్లు తేలితే.. చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. అయితే ఎక్కువ సంఖ్యల్లో విద్యార్ధులు అస్వస్థతకు గురికావడంతో వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.