ఏ క్షణానికి ఏం జరుగుతుందో ఎవరం ఊహిచలేము. కాలం చాలా విచిత్రమైనది. అది ఆడించే నాటకంలో మనం కేవలం పాత్రదారులం మాత్రమే. కాలం ఎలాంటిది అంటే.. అందరూ సంతోషం గా ఉన్నారు అనుకున్న సమయంలో విషాదంలోకి నెట్టేస్తుంది. తాజాగా రాజస్థాన్ లో జరిగిన ఘోర ప్రమాదం అలాంటిదే. కాసేపట్లో పెళ్లి చేసుకుని ఓ కొత్త జీవితంలోకి అడుగుపెట్టాలని ఆశలతో ఉన్న వరుడిని ఘోర రోడ్డు ప్రమాదంలో బలి తీసుకుంది. రాజస్థాన్‌లో ఓ కారు నదిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో వరుడుతో సహా 9 మంది మృతి చెందారు.
వివరాల ప్రకారం.. ఉజ్జయినిలో వివాహం చేసుకోవడం కోసం వెళ్తున్న పెళ్లి కొడుకు కారు ప్రమాదవశాత్తు కోటాలోని ఛోటీ పులియా వద్ద చంబల్ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వరుడితో సహా తొమ్మిది మంది మృతి చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నకోటా పోలీసులు క్రేన్ సాయంతో మృతదేహాలను బయటకు తీస్తున్నారు. పెళ్లి కొడుకు, కుటుంబ సభ్యుల మృతితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కారు డోర్లు తెరుచుకోక పోవడం వల్లనే మృతుల సంఖ్య పెరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఏడు మృతదేహాలు లభ్యం కాగా.. ఘటన జరిగిన ప్రదేశానికి కొంత దూరంలో మరో రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. కారులో ఇంకెవరైనా ఉన్నారా అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా కారు ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు.