ఈ మధ్యకాలంలో ప్రతి చిన్న విషయానికి దంపతులు గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో గొడవ.. గాలి వాన చిలికి చిలికి తుఫాన్ లా మారినట్లు పెద్దది అవుతుంది. ఇంక దారుణం ఏమిటంటే.. చికెన్, మటన్, రిమోట్.. ఇలా పిల్లలు గొడవపడే వాటికి కూడా కొందరు భార్యాభర్తలు ఫైటింగ్ చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు సైతం పోతున్నాయి. తాజాగా బిర్యానీ విషయంలో వృద్ధ దంపతులు మధ్య జరిగిన గొడవ కాస్త వారి ప్రాణల మీదకు తెచ్చింది. వాదన సమయంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త..భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటిచాడు. మంటలకు తాళలేక ఆమె కేకలు వేస్తూ భర్తను గట్టిగా కౌగిలించుకుంది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆ దంపతుల పరిస్థితి విషయమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరంలోని ఠాగూర్ నగర్ ప్రాంతంలో కరుణాకరన్(75), ఆయన భార్య పద్మావతి(66) అనే వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. కరుణాకరన్ రైల్వే రిటైర్డ్ ఉద్యోగి. ఇద్దరి మధ్య అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తుండేవి. ఒక్కొక్కసారి ఆ గొడవలు పెద్దగా కూడా మారేవి. అలానే మంగళవారం రాత్రి కరుణాకరన్ ఇంటికి బిర్యానీ తెచ్చుకొని తిన్నాడు. ఆ విషయం భార్యకు చెప్పలేదు. అయితే బిర్యానీకి సంబంధించిన పార్శీల్ కవర్లను చెత్త బుట్టలు పద్మావతి చూసింది. దీంతో తనకు ఇవ్వకుండా ఎందుకు బిర్యానీ తిన్నావని ఆయనను ప్రశ్నించింది. అలా చాలా సేపు వారిద్దరి మధ్య వాదోపవాదనలు జరిగాయి. చివరకు మాటకు మాట పెరగడంతో ఒకరిపై మరొకరు భౌతిక దాడి చేసుకున్నారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన భర్త కరుణాకరన్ పక్కనే ఉన్న కిరోసిన్ డబ్బాను తీసుకుని భార్య పద్మావతిపై పోశాడు.
ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నించే లోపే నిప్పంటించాడు. దీంతో మంటల్లో చిక్కుకున్న ఆమె పెద్దగా కేకలు వేస్తూ కరణాకరన్ ను గట్టిగా పట్టుకుంది. దీంతో ఇద్దరు మంటల్లో చిక్కుకుని పెద్ద పెద్ద కేకలు వేశారు. దీంతో వీరి అరుపులు విన్న చుట్టుపక్కల వారు అక్కడి చేరుకుని..మంటలను ఆర్పివేసి..వారిని ఆస్పత్రికి తరలించారు. ఆ వృద్ధ దంపతులు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. యువతకు మంచి చెప్పాల్సిన పెద్దలు.. బిర్యానీ కోసం గొడవ పడి ప్రాణాలమీదకు తెచ్చుకోవటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.