ఐపీఎల్ టికెట్ల పంచాయితీ తమిళనాడు అసెంబ్లీకి పాకింది. మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్ల కోసం ఓ ఎమ్మెల్యే ఏకంగా ప్రభుత్వానికి విన్నవించాడు. కానీ అటువైపు నుంచి తూటాల్లాంటి సినిమా డైలాగులు పేలాయి. ఆ సమాధానం ఇచ్చింది ఎవరో కాదు.. సినీనటుడు, తమిళనాడు క్రీడా మంత్రి ఉదయనిధి స్టాలిన్. ఆయనిచ్చిన సమాధానం వింటే మీరు కూడా నవ్వాల్సిందే.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023(ఐపీఎల్) హోరాహోరీగా సాగుతోంది. మొదటి మూడు.. నాలుగు మ్యాచులు చప్పగా సాగినా.. ఆపై ప్రతి మ్యాచ్ అసలు మజాను పంచుతున్నాయి. ఊహకు అందని ఫలితాలతో ఐపీఎల్‌పై ఉన్న క్రేజ్‌ను మరింత పెంచేస్తున్నాయి. ఆదివారం కోల్ కతా- గుజరాత్ మధ్య జరిగిన మ్యాచులో కేకేఆర్ యువ క్రికెటర్ రింకూ సింగ్ చివరి 5 బంతుల్లో 5 సిక్సులు బాది తన జట్టును గెలిపిస్తే.. సోమవారం ఆర్సీబీ-లక్నో మధ్య జరిగిన మ్యాచ్, మంగళవారం ఢిల్లీ- ముంబై మధ్య జరిగిన మ్యాచులు ఆఖరి బంతి వరకు నువ్వా-నేనా అన్నట్టు సాగాయి. ఈ క్రమంలో ఇంత థ్రిల్లింగ్‌గా సాగుతోన్న ఐపీఎల్ మ్యాచులను ప్రత్యక్షంగా చూసే అవకాశాన్ని కల్పించాలని కోరారు.. ఓ ఎమ్మెల్యే. ఐపీఎల్ మ్యాచుల టిక్కెట్లు ఇప్పించండి అంటూ ప్రభుత్వానికి విన్నవించాడు. ఈ ఘటన తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకుంది.
మంగళవారం తమిళనాడు అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికి మాజీ మంత్రి, అన్నాడీఎంకే విప్ ఎస్పీ వేలుమణి ఐపీఎల్ టికెట్ల ప్రస్తావన తీసుకొచ్చారు. చెన్నైలో జరిగే మ్యాచులను ప్రత్యక్షంగా వీక్షించేందుకు టికెట్లు ఎమ్మెల్యేలకు అందించాలని కోరాడు. గతంలో పళనిస్వామి ప్రభుత్వం ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చేదని ఆయన తెలిపారు. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం టికెట్లు కొని ఎమ్మెల్యేందరికీ ఇవ్వాలని విన్నవించాడు. దీనిపై స్పందించిన క్రీడాశాఖ మంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్షాలకి ధీటుగా సమాధానమిచ్చాడు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల అంశం రాష్ట్ర పరిధిలో ఉండవని, బీసీసీఐ కేంద్రమంత్రి అమిత్ షా కొడుకు అధీనంలో ఉన్నాయంటూ కౌంటరిచ్చాడు.
ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ.. “గడిచిన నాలుగేళ్లలో చెన్నైలో మ్యాచులే జరగలేదు. మరి టికెట్లు కొని ఎవరికి ఇచ్చారు? అయినా ఐపీఎల్ నిర్వహించేది ఎవరు బీసీసీఐ. దాని చైర్మన్ ఎవరు..? మీకు మిత్రుడైన అమిత్ షా కుమారుడు జైషా. అతన్ని మేము టికెట్లు అడిగినా ఇవ్వరు. మీరు అడిగితే తప్పకుండా ఇస్తారు. ఆ పని చేయండి..” అంటూ ఉదయనిధి స్టాలిన్ అన్నాడీఎంకే ఎమ్మెల్యేకు చురకలంటించారు. దీంతో సభలోని సభ్యులంతా పక్కున నవ్వారు. ఐపీఎల్ లో తమిళనాడు తరఫున చెన్నై సూపర్ కింగ్స్ బరిలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ధోనీ సారథ్యంలో చెన్నై ఉండడంతో తమిళ ప్రజలు మ్యాచ్ లపై అమిత ఆసక్తి చూపిస్తుస్తున్నారు. ఈ క్రమంలోనే అసెంబ్లీలో టిక్కెట్ల ప్రస్తావన తీసుకొచ్చారు ఎమ్మెల్యే.
“IPL is managed by BCCI. Jay Shah, son of your close friend Amit Shah, is the head of BCCI. If we ask (for tickets) they won’t listen to us. But if you ask them, they will listen.”
TN minister @Udhaystalin’s response to AIADMK MLA SP Velumani who asked for IPL tickets for MLAs👇🏽 pic.twitter.com/HLizgyizjM
— Shilpa (@Shilpa1308) April 11, 2023