దొంగలు ఈజీ మనీ కోసం ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బు సంపాదన కోసం ఎదుటి వారి ప్రాణాలు తీయడానికి కూడా వెనుకంజవేయడం లేదు. రాజస్థాన్ లో పెద్ద ప్రమాదం తప్పింది. ఓ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ ప్లాంట్ పైపు లైన్ ని కట్ చేసి దొంగిలించే ప్రయత్నం చేశారు.. అంతలోనే సిబ్బంది అప్రమత్తం కావడంతో అక్కడ నుంచి పారిపోయారు. అయితే ఆక్సీజన్ పై ఆధారపడిన 20 మంది నవజాతి శిశువుల పరిస్థితి అయోమయంగా మారడంతో వెంటనే సిలిండర్ల ద్వారా ఆ చిన్నారులకు ఆక్సీజన్ అందించారు ఆస్పత్రి సిబ్బంది. దీంతో చిన్నారులు ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన రాజస్థాన్ అల్వార్ నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
అల్వార్ పట్టణంలోని గీతానంద్ శిశు ఆస్పత్రిలో ఎఫ్బీఎన్సీ వార్డులో 20 మంది నవజాతి శిశువులకు ఆక్సీజన్ అందిస్తున్నారు. ఆదివారం రాత్రి కొంత మంది గుర్తు తెలియని దుండగులు అక్కడ ఏర్పాటు చేసి ఆక్సీజన్ ఫ్లాంట్ కు ఏర్పాటు చేసి పైప్ లను దొంగిలించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆక్సీజన్ పైపులను కట్ చేశారు. దీంతో ఎఫ్బీఎన్సీ వార్డు కి అందాల్సిన ఆక్సీజన్ సరఫరా ఆగిపోవడంతో అందరూ ఆందోళన చెందారు. ఇది గమనించిన గార్డులు ఆక్సీజన్ ఫ్లాంట్ వద్దకు చేరుకోగానే దొంగలు గమనించి అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు.. అక్కడే ఉన్న చిన్నారుల కుటుంబ సభ్యులు దొంగలను పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
ఇక చిన్నారులకు అత్యవసరంగా ఆక్సీజన్ అందించే క్రమంలో ఆక్సీజన్ ఫ్లాంట్ వద్ద నింపి ఉన్న సిలిండర్లను ఎఫ్బీఎస్సీ వార్డుకు తరలించి నవజాతి శిశువులకు ఆక్సీజన్ అందించడంతో చిన్నారులకు ఎలాంటి అపాయం జరగలేదు. దీంతో కుటుంబ సభ్యులు, ఆస్పత్రి సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. గతంలో కొంత మంది దొంగలు ఆస్పత్రిలో విద్యుత్ వైర్లు, పైపు లైన్లతో పాటు ఇతర వస్తువులను దోచుకు వెళ్లారని సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగలను స్టేషన్ కి తరలించి విచారిస్తున్నారు.