ఎన్నో ఏళ్ల ఘన చరిత్రను మూటగట్టుకుని దేశ ప్రజల కోసం అనేక ఉద్యమాలు చేసిన పార్టీ కాంగ్రెస్. తెల్ల దొరల నుంచి విముక్తి కొరకై స్వతంత్రాన్ని అందించి భారతావనికి ఉపశమనం కలిగించింది. అసేతు హిమాచలాన్ని ఒంటి చేత్తో ఏలిన కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేడు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయనే చెప్పాలి. గత కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది నిఖార్సయిన నాయకులను చూశాం. ఆనాటి మేటి రాజకీయ నాయకుల్లాంటి నేతలు నేటి తరంలో ఒక్కరు కూడా కనిపించరనే చెప్పాలి.
ఇక ఇప్పటి కాంగ్రెస్ పార్టీలో సరైన నాయకుడు లేక పార్టీలోని చాల మంది నేతలు ఒక్కొక్కరుగా జారుకుంటున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీంతో బాధ్యతగా రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అప్పటి నుంచి సరైన నాయకుడి కోసం ఎదురుచూస్తోంది. ఈ మధ్య మళ్లి రాహుల్ గాంధీనే అధ్యక్షుడిగా ఎన్నుకుంటారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇక తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ గాంధీ పార్టీ నేతల తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. పార్టీలోని అసమ్మతి నేతలను ఉద్దేశించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
భయపడే వారికి పార్టీలో స్థానం లేదని, అలాంటి వారు ఉంటే వెంటనే వెళ్లిపోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి ధైర్యంగా ఉండే నేతలే కావాలని, అదే మా సిద్ధాంతమంటూ తెలిపారు. రాహుల్ ఇలాంటి తీవ్రమైన వ్యాఖ్యలు చూస్తుంటే లోలోపల ఏదో జరిగిందని తెలుస్తోంది. ఇక ఇటీవల కాలంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ రాహుల్ గాంధీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ భేటీ తరువాత రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఒక రకంగా పీకే కాంగ్రెస్ లో చేరుతున్నారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మరి దీంట్లో వాస్తవం ఎంతనేది తెలియాల్సి ఉంది.