అన్నదాతలను ఆర్థికంగా ఆదుకోవటం కోసం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పలు పథకాలను దేశ వ్యాప్తంగా ప్రవేశపెట్టారు. రైతులకు ఆర్థిక భరోస కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అనే పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. పీఎం కిసాన్ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.6000 ఆర్థిక సహాయం చేస్తున్నారు. అయితే ఈ డబ్బులను విడతల వారీగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారు.
ప్రతి సంవత్సరం మొదటి విడత ఏప్రిల్ 1 నుంచి జులై 31 వరకు.. రెండో విడత.. ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు.. మూడో విడత డిసెంబర్ 1 నుంచి మార్చి 31 వరకు వస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంలో పలు మార్పులు చేసింది. మారిన నిబంధనల ప్రకారం పొలం ఎవరి పేరు మీద ఉంటుందో వారికే ఈ పథకం వర్తిస్తుంది. అంటే పూర్వీకుల పేర్లపై భూములు ఉన్నవారికి, భాగస్వామ్యంగా భూములు సంక్రమించిన వారికి ఇది ఇబ్బందే. ఇలాంటి వారికి పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం వర్తించదు.
భూమి తమపేరుపై ఉన్న రైతులు కొన్ని వివరాలు కేంద్ర వైబ్ సైట్ లో పొందుపరచాలి. పీఎం కిసాన్ పథకం కింద కొత్తగా రిజిస్ర్టేషన్ చేసుకునే రైతులు తమ భూములకు సంబంధించిన సర్వే నెంబర్, ఇతర వివరాలు కేంద్ర వైబ్ సైట్ లో ఎంట్రీ చేయాలి. పాత లబ్ధిదారులపై ఈ నిబంధనల ప్రభావం ఉండదు. పథకానికి సంబంధించిన వివరాలను నెట్ లో మీరైనా పొందు పరచవచ్చు. ఈ పథకం కోసం పంచాయతీ కార్యదర్శి గానీ లేదా పట్వారీ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.