అమ్మాయిల పెళ్లి వయసుపై తాజాగా పంజాబ్ హర్యానా హై కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 16 ఏళ్లు నిండిన అమ్మాయి తనకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవచ్చంటూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. తాజాగా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో కొన్ని చోట్ల విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. అసలేం జరిగిందంటే? పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్ కోట్ కు చెందిన 16 ఏళ్ల అమ్మాయి, 21 ఏళ్ల అబ్బాయి కొంతకాలంగా ప్రేమించుకున్నారు. ఒకరిని విడిచి మరొకరు బతకలేనంతగా తయారయ్యారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలనే భావనకు వచ్చారు.
అయితే ఈ క్రమంలోనే వీరి ప్రేమ వ్యవహారం యువతి కుటుంబ సభ్యులకు తెలిసింది. వీరిని మందలించి పెళ్లికి అంగీకరించేది లేదంటూ కరాకండిగా చెప్పారు. దీంతో జూన్ 8వ తేదీన వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. పెద్దలను ఎదురించి తాము పెళ్లి చేసుకున్నామని తల్లిదండ్రుల నుంచి రక్షణ కల్పించాలంటూ ఆ దంపతులు పంజాబ్ కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసును విచారించిన కోర్టు సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. 16 ఏళ్లు నిండిన ముస్లిం మహిళ తను ఇష్టపడ్డ వ్యక్తిని పెళ్లిచేసుకోవచ్చని, కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్న వాళ్ల ప్రాథమిక హక్కుల్ని కాలరాయలేమని న్యాయస్థానం తెలిపింది.
ఇది కూడా చదవండి: Antahpuram: ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు.. చివరికి భార్య అందంగా లేదని!
ఇక ఇస్లామిక్ షరియా చట్టాన్ని తన తీర్పులో ప్రస్తావించిన న్యాయమూర్తులు ముస్లిం అమ్మాయిల పెళ్లిళ్లు ముస్లిం పర్సనల్ చట్టం పరిధిలోకి వస్తాయన్నారు. సర్ దిన్‌షా ఫర్దునిజి ముల్లా రాసిన మొహమ్మదీయ సూత్రాల్లో ఆర్టికల్ 195 ప్రకారం ముస్లిం అమ్మాయికి 16 ఏళ్లు నిండాయని, దాని ప్రకారమే ఆ యువతి పెళ్లి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అబ్బాయి వయసు 21 ఏళ్లు దాటినందున ముస్లిం పర్సనల్ లా కూడా దీన్ని అంగీకరిస్తుందని కోర్టు తెలిపింది. అయితే తాజాగా పంజాబ్ హర్యానా హై కోర్టు అమ్మాయిల పెళ్లి వయసు విషయంలో ఈ విధమైన తీర్పును వెలువరించడంతో ఒక్కొక్కరు ఒకోలా స్పందిస్తున్నారు. కోర్టు తీర్పుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.