ప్రధానమంత్రి నరేంద్రమోదీ పార్లమెంట్ లో ప్రసంగించారు. గతకొన్ని రోజుల నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం సభ ను ఉద్దేశించి ప్రధాని ప్రసగించారు. పార్లమెంటులో రాష్ట్రపత్రి.. తన ప్రసంగంతో మనందరిలో స్ఫూర్తి నింపారని ప్రధాని మోదీ తెలిపారు. రాష్ట్రపతికి ధన్యవాద తీర్మానంపై ప్రధాని లోక్ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఓ రేంజ్ లో విరుచక పడ్డారు. అలానే తమ ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం, ప్రజల కోసం ఏం చేసిందో వివరించారు. ఇక తన విషయానికి వస్తే.. దేశం కోసం తన జీవితాన్నే అంకితం చేశానని మోదీ తెలిపారు.
రాష్ట్రపతి ప్రసంగంపై బుధవారం పార్లమెంటు లో ప్రధాని మోదీ ప్రసంగించారు. మంగళవారం సభలో కొందరు చాలా హుషారుగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ అన్నారు. ఆ మాటలకు తాను చాలా థ్రిల్ అయ్యానని మోదీ సైటర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు. ఇక దేశాభివృద్ధి గురించి మోదీ మాట్లాడుతూ.. తన సమస్యల పరిష్కారం కోసం భారత్ ఒకప్పుడు ఇతరులపై ఆధారపడేదని, కాని నేడు ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి అన్నారని మోదీ గుర్తుచేశారు.
తమ ప్రభుత్వం దేశంలోని అవినీతిని నిర్మూలించిందని ప్రధాని అన్నారు. 2014 నుంచి నేటివరకు తమ ప్రభుత్వం ఏం చేసిందో దేశ ప్రజలకు తెలుసని, అందుకే వారు పదే పదే తమకు మద్దతు ఇస్తున్నారని మోదీ అన్నారు. 2004 నుంచి 14 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలిందని, భారీ కుంభకోణాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. 2జీ, బొగ్గు స్కామ్, కామన్ వెల్త్ క్రీడల్లో అవినీతి జరిగిందని, ఆ పదేళ్ల కాలం అనేది దేశంలోనే అవినీతి దశాబ్దమైందని మోదీ ఘాటుగా విమర్శించారు. యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో ఉగ్రవాదం, అవినీతి విపరీతంగా ఉండేదని నేడు అటువంటి పరిస్థితులు లేవని ప్రధాని అన్నారు. ప్రస్తుతం దేశంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వమే ఉందని, విపక్ష నేతలు తొమ్మిదేళ్లుగా ఆలోచన ఏమీ చేయకుండా, కేవలం ఆరోపణలు చేయడంపైనే దృష్టిపెట్టారని మోదీ వ్యాఖ్యానించారు.
ఇక తన గురించి కూడా ప్రతి పక్షాలు చేసే ఆరోపణలపై ప్రధాని ఘాటుగా స్పందించారు. మోదీపై బురదజల్లి విపక్షాలు లబ్ధిపొందాలని అనుకుంటున్నాయని, టీవీలు, పేపర్లలో తనపై విమర్శలు చేస్తే లబ్ది పొందలేరని ఆయన అన్నారు. దేశ ప్రజలకు తనపై విశ్వాసం ఉందని, అలానే దేశం కోసమే తన జీవితాన్ని అంకితం చేశానని మోదీ తెలిపారు. పీఎం ఆవాస్ యోజనతో సొంతింటి కల సాకారం చేసుకున్న సామాన్యులు మీ విమర్శలు నమ్మే పరిస్థితి ఉందా? వన్ నేషన్-వన్ రేషన్ తో లబ్ధి పొందే పేదలు మీ మాటలను నమ్ముతారా? అంటూ ప్రతిపక్షలను మోదీ ప్రశ్నించారు. కొందరు కేవలం ఒకే కుటుంబానికి సేవ చేస్తారని, కానీ 25 కోట్ల కుటుంబాల్లో తాను ఓ సభ్యుడినంటూ మోదీ ఉద్వేగ భరితంగా ప్రసగించారు. 140 కోట్ల మంది ప్రజలే తనకు రక్షణ కవచమని, దాన్ని మీరు ఛేదించలేరంటూ మోదీ విపక్షాలను ఏకిపారేశారు.