నాగాలాండ్‌లో దారుణం చోటు చేసుకుంది. భద్రతా దళాలు మిలిటెంట్లుగా భావించి జరిపిన కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. నిన్న సాయంత్రం మోన్ జిల్లా ఓటింగ్‌లో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా దళాల కాల్పుల్లో మరణించిన వారందరూ బొగ్గు గని కార్మికులుగా గుర్తించారు. వారు విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయనే పక్కా సమాచారంతో భారత జవాన్లు మోన్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యలు చేపడుతున్న సమయంలో పనులు ముగించుకుని వస్తున్న కార్మికులను మిలిటెంట్లుగా పొరబడిన భద్రతా దళాలు ఒక్కసారిగా కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన 11 మందిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన తరువాత ప్రజలు ఆగ్రహంతో భారత జవానుల వాహనాలను తగలబెట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దీనిపై నాగాలాండ్ ముఖ్యమంత్రి నెయ్‌ప్యూ రియో స్పందించారు. వెంటనే దర్యాప్తు ప్రారంభిస్తామని, దీనిపై సిట్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు.