టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి హెచ్చరిక పంపారు. పనిలో నిర్లక్ష్యం.. నిబద్దత లోపిస్తే.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని కేంద్ర టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్.. 62 వేల మంది బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇటీవలే బీఎస్ఎన్ఎల్ పునరుద్ధరణకు రూ.1.64 లక్షల కోట్లతో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించడం తెలిసిందే.
గత కొంత కొంత కాలంగా టెలీకాం రంగంలో ప్రైవేట్ సంస్థలు దూసుకు వెళ్తున్న కారణంగా బీఎస్ఎన్ఎల్ బలోపేతానికి కేంద్రప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నుంచి బీఎస్ఎన్ఎల్ లో చేస్తున్న ఉద్యోగులు యాక్టీవ్ గా ఉండాలని.. సర్కారీ ఉద్యోగాలు అన్న ధీమా తొలగించుకోవాలని.. వారి పనితీరు పూర్తిగా మెరుగుపర్చుకోవాలని మంత్రి అశ్వని వైష్ణవ్ హెచ్చరించారు. టెలికం బీఎస్ఎన్ఎల్ సీనియర్ యాజమాన్యంతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి పై విధంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇక ముందు బాధ్యతతో సంస్థ అభివృద్దికి పాటుపడతామని ప్రతి ఒక్కరూ నిర్ణయించుకోవాలని.. లేదంటే నిర్మోహమాటంగా వెళ్లి పోవాలని.. ఈ విషయంలో మీకు ఎలాంటి సందేహం అక్కర్లేదు. పనిచేయడమా లేదంటే వెళ్లిపోవడమా’ అని మంత్రి బీఎస్ఎన్ఎల్ టాప్ ఉద్యోగులకు తేల్చి చెప్పారు. అంతేకాదు మెరుగైన సేవలు అందిస్తూ.. ప్రజలకు బీఎస్ఎన్ఎల్ పై సేవలు మరింత చేరువ అయ్యేలా చూడాలని.. దానికోసం గట్టిగా కృషి చేయాలని సూచించారు.
ఒకవెళ ఇక్కడ పనిచేయడం ఇష్టం లేనివారు.. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకుని ఇంటికి పోవడమే. వారు వీఆర్ఎస్ తీసుకోవడానికి ముందుకు రాకపోతే మేమే 56జే నిబంధన వాడతాం అని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో ఉన్నత ఉద్యోగులను సైతం మినహాయింపు ఉండదని ఆయన పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న బీఎస్ఎన్ఎల్ విషయంలో పెద్ద రిస్క్ చేస్తున్నామని, నెలవారీగా ఉద్యోగుల పనితీరును పరిశీలిస్తామని పేర్కొన్నారు.