హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత సీఎం కేసీఆర్ మొదటి సారి మీడియాతో మాట్లాడారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే, తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేయాలని చూస్తే సహించనని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇష్టం వచ్చినట్లు హద్దు మీరి అడ్డం పొడవు మాట్లాడుతున్నారని, ఇప్పటిదాకా ఎన్ని మాట్లాడినా, ఎలా మాట్లాడినా కూడా అతనిది నా స్థాయి కాదు, చిన్న వాడన్న ఉద్దేశంతో పట్టించుకోకుండా క్షమిస్తూ వచ్చానని.. నన్ను జైలుకు పంపుతా అంటున్నారని, ఎందుకింత అహంకారం.. దమ్ముంటే టచ్ చేసి చూడాలని సీఎం కేసీఆర్ సవాల్ చేశారు. ఏడేళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న తెలంగాణ రైతుల బతుకు ఆగం చేసేలా, ధర్నాలతో రాజకీయ పబ్బం గడుపుకొనేందుకు చేస్తున్న ప్రకటనలతో బాధ కలుగుతోంది అన్నారు. ఇటీవల బీజేపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ విధంగా స్పందించారు.
ఢిల్లీ బీజేపీ ఒకలా.. సిల్లీ బీజేపీ ఒకలా..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఢిల్లీ బీజేపీ వరి సాగు చేయొద్దు అంటుంటే, రాష్ట్రంలోని సిల్లీ బీజేపీ వరి వేయాలని అంటోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పనికిమాలిన మాటలు నమ్మి వరి వేస్తే రైతులు నష్టపోతారని సీఎం అన్నారు. తెలంగాణ నుంచి వరి కొంటామని కేంద్రం నుంచి ఆర్డర్ తెస్తే.. నాతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి 70, 80 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసేలా చూస్తాం. అలా తెచ్చే దమ్ము బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్‌లో, ఢిల్లీలో పోరాడుతామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకొనేందుకు అన్నిరకాల పోరాటానికి సిద్ధమన్నారు. వ్యవసాయ చట్టాల పేరిట రైతుల ప్రయోజనాలను కార్పొరేట్లకు అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని, ఏడాదికాలంగా ఢిల్లీలో ధర్నా చేస్తున్న రైతుల మీద కార్లు ఎక్కించి చంపుతున్నారని, బృందాలుగా ఏర్పడి రైతులను కొట్టాలని బీజేపీ సీఎంలే రెచ్చగొడుతున్నారని, ఉత్తర భారత్‌లో రైతుల ఆందో ళనలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి..
ఇన్నాళ్లూ పిచ్చికూతలు కూసినా క్షమించి వదిలేసినట్లు, ఇకపై ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బీజేపీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ హెచ్చరించారు. తాము ఢిల్లీ నుంచి కాకుండా.. ప్రజలు నామినేట్ చేస్తే వచ్చామని, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగితే విచారణ చేసుకోవచ్చని అన్నారు. వీధుల్లో కుక్కల్లా ఇష్టమొచ్చినట్లు మొరుగుతరా? తాము ఉద్యమాలు చేసినోళ్లం. బీ కేర్‌ఫుల్.. కుసంస్కారులు, హీనుల్లా రాజకీయ విలువలు దిగజారుస్తూ ఎంతకాలం మోసం చేస్తారని మండిపడ్డారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచి ఓ మెడికల్ కాలేజీనో, ఇంకేదో తెచ్చిండా? ఆ మనిషికి ఇంగ్లిషో, హిందీయో వస్త దా? కేంద్రం నుంచి వచ్చిన లెటర్లు అర్థమైతయా? అలాంటి దుర్మార్గుడు తెలంగాణ ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు వద్దని లేఖ ఇచ్చాడని బండి సంజయ్‌పై మండిపడ్డారు.
హుజూరాబాద్‌లో ఓటమిపై…
ఉప ఎన్నికల్లో ఓ పార్టీ ఓటమి, మరొకరు గెలుపు సహజమని అన్నారు. మొన్నసాగర్‌లో బీజేపీ ఓడి డిపాజిట్ పోయింది. హుజూరాబాద్‌లో ఓడితే భూమి బద్దలవుతదా అని సీఎం అన్నారు. దేశంలో 30కిపైగా సీట్లలో ఉప ఎన్నిక జరిగితే.. బీజేపీవి చాల చోట్ల ఓడిపోయిందని, అంటే బీజేపీకి వ్యతిరేకంగా తీర్పువచ్చినట్టా? ఉప ఎన్నికల పరిణామాలను మేం పట్టించుకోం. అసలు మీకు రాష్ట్రంలో ఆర్గనైజేషన్ ఉందా? 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 107 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. అలాంటిది ఇప్పుడు ఉప ఎన్నిక రాగానే సోషల్ మీడియాలో అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
దేశాన్ని నాశనం చేశారు..
టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా అడుగుతున్నా.. బీజేపీ ఏడేళ్ల పాలనలో దేశానికి ఏం ఒరగబెట్టారు. దళితులు, ఎస్టీలు, బీసీలు, నిరుద్యోగులు, రైతులకు ఏదైనా చేశారా? అని బీజేపీని ప్రశ్నించారు. అంతర్జాతీయ సరిహద్దు సమస్యలు, మతపరమైన భావోద్వేగాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకునే రాజకీయంతో దేశాన్ని నాశనం చేశారు. చైనా మన అరుణాచల్‌ప్రదేశ్‌లో ఊళ్లకు ఊళ్లే కడుతూ దంచుతోంది. అక్కడ చేతకాక బీజేపీ తోకముడిచింది. జీడీపీ, ఆహార భద్రతను దెబ్బతీసింది. ఎల్‌ఐసీ వంటి ప్రభుత్వరంగ సంస్థలను దెబ్బతీసింది. అడ్డగోలు పన్నులతో ప్రజల మీద భారం పెంచింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు వంటి అంశాల్లో రాష్ట్రాల మీద ఒత్తిడి పెంచి బ్లాక్‌మెయిల్ చేస్తోంది. ఇకపై ఇలాంటి వాటిమీద అటు కేంద్రం, ఇటు రాష్ట్ర బీజేపీ వెంట పడతం అని అన్నారు.