గత ఏడాది డిసెంబర్ 10న చెన్నై విమానాశ్రయంలో ఓ ఘటన చోటుచేసుకుంది. చెన్నైనుండి తిరుచునాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానం టేకాఫ్ తీసుకోవడానికి ముందు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు తెరుచుకున్నాయి. ఈ విషయమై మంగళవారం ఇండిగో ఓ ప్రకటన చేసిందీ కానీ.. ఆ వ్యక్తి పేరును ప్రస్తావించలేదు. ఆ తప్పిదానికి సదరు ప్రయాణికుడు క్షమాపణలు చెప్పాడు అంటూ చేతులు దులుపుకుంది. కానీ మీడియా వదలదు కదా.. చివరకు ఆ ఘనకార్యాన్ని చేసింది బీజెపీ ఎంపి, యువ మోర్చా అధ్యక్షుడు తేజశ్వి సూర్యనే అని తేల్చేశాయి. అసలు విషయాన్ని బయటపెట్టాయి.
అసలు ఆ రోజు ఏం జరిగిందంటే.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ దగ్గర తమిళనాడు బీజెపీ చీఫ్ కె అన్నామలై, ఆ పక్కనే తేజశ్వి సూర్య కూర్చొన్నారు. విమానం టేకాఫ్ తీసుకుంటుండగా.. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ తెరిచారు. దీంతో విమానం ఆగిపోయింది. ప్రయాణీకులు భయానికి, అసహనానికి గురయ్యారు. సిబ్బంది ఏం జరిగిందా అని తెలుసుకునే సరికి.. రెండు గంటలు ఆలస్యమైంది. భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసిన తర్వాత విమానం టేకాఫ్ తీసుకుంది. ఈ సంఘటన అధికారికంగా నమోదైంది. దీంతో తేజశ్వి లిఖిత పూర్వ క్షమాపణలు చెప్పారని సమాచారం. అయితే తేజశ్వి చర్యను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిసిజిఎ) తప్పుగా అభివర్ణించింది.
ఇంతకీ ఎవరా తేజశ్వి సూర్య అనుకుంటున్నారా. సౌత్ బెంగళూరు బీజెపీ ఎంపి. 1990లో జన్మించిన ఈ బీజెపీ యువ నేత .. వివాదాస్పద వ్యాఖ్యలు, పనులతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. గత ఏడాది విడుదలై, వివాదాస్పద చిత్రంగా నిలిచిన ‘ది కాశ్మీర్ ఫైల్స్ ’పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ..ఆయన ఇంటి దగ్గర రచ్చ రచ్చ చేసిన కాషాయ దళానికి నాయకత్వం వహించింది తేజశ్వినే. గతంలో బెంగళూరు ఉగ్రవాద కేంద్రంగా మారిదంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. హిందు మతం నుండి ఇతర మతాల్లోకి మారిన వారిని ..తిరిగి సొంత మతం లోకి రప్పిస్తామని ఘర్ వాపసీ అనే కార్యక్రమాన్ని చేపట్టి వార్తల్లో నిలిచారు. కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్న తేజశ్వి.. న్యాయ శాస్త్రంలో పట్టభద్రుడు. ఆయన తండ్రి మాజీ ఎక్సైజ్ కమీషనర్. అతని మామ ఎల్ ఎ రవి సుబ్రమణ్య.. బసవగుడి ఎమ్మెల్యే కావడం గమనార్హం.