అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న నేటి కాలంలో కూడా సమాజంలో ఆకలి కేకలు, చావులు చోటు చేసుకుంటున్నాయి అంటే సిగ్గు చేటు. ఈ కాలంలో కూడా తినడానికి తిండి లేక మరణాలు సంభవిస్తున్నాయి అంటే ఆ సమాజం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. ఇలాంటి హృదయవిదారక సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
అభివృద్ధి సాధించాం.. ప్రగతిలో ప్రపంచ దేశాలతో పోటీ పడి ముందుకు సాగుతున్నాం అని గొప్పగా చేప్పుకుంటున్నాం.. మరోవైపు పేదరికం, ఆకలి కేకలు అలానే కొనసాగుతున్నాయి. నేటి కాలంలో కూడా ఆకలి చావులు వెలుగు చూస్తున్నాయి అంటే ఎంతటి దారుణమైన పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తినడానికి కనీసం తిండి లేక… ఆకలితో అలమటించి మనుషులు ప్రాణాలు కోల్పోతున్నారు అంటే.. సమాజంలో ఎంతటి దురదృష్టకర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తాజాగా ఆకలి బాధలు తాళలేక ఓ కుటుంబంలో రెండు మరణాలు సంభవించడం ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. తిండి లేక ఓ మహిళ భర్త, తల్లి మృతి చెందారు. వారిని దహనం చేసేందుకు కనీసం చేతిలో రూపాయి లేక సదరు మహిళ వారం రోజుల పాటు మృతదేహాలతోనే కలిసి ఉంది.
ఈ విషాదకర సంఘటన తమిళనాడులో వెలుగుచూసింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాలయంలోని వండిప్పేట్టై కుమణన్ వీధికి చెందిన శాంతి, మోహనసుందరం ఇద్దరు దంపతులు. వీరికి మానసిక దివ్యాంగుడైన కుమారుడు శరవణకుమార్, కుమార్తె శశిరేఖ ఉన్నారు. తల్లిదండ్రులు ఇద్దరూ కుమారుడు బాగోగులు చూసుకుంటూ ఉండగా.. కుమార్తె శశిరేఖ ఆ కుటుంబానికి అండగా ఉంటూ కూలీ పనులు చేసి తల్లిదండ్రులు, తమ్ముడిని పోషించింది. అయితే కొన్నేళ్ల క్రితం శశిరేఖకు వివాహం చేయడంతో ఆమె అత్తారింటికి వెళ్లింది. దాంతో కుటుంబపోషణ కష్టంగా మారింది.
ఈ క్రమంలో శశిరేఖ తల్లి శాంతి, అమ్మమ్మ అంతే శాంతి తల్లి కనకంబాళ్, తండ్రి, తమ్ముడు తిండి లేక పస్తులుండేవారు. వీరి పరిస్థితి తెలిసి.. అప్పుడప్పుడూ చుట్టుపక్కలవారు దయతలిచి వీరికి ఆహారం అందించేవారు. దాంతోనేవారు జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా ఆహారం లేకపోవడంతో.. వారం రోజుల కిందట శశిరేఖ తండ్రి మోహనసుందరం, కనకాంబాళ్ తిండిలేక ప్రాణాలు విడిచారు. తినడానికి తిండి లేకనే ప్రాణాలు కోల్పోయిన దీన స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి చనిపోయిన వారికి అంత్యక్రియలు నిర్వహించే స్తోమత కూడా లేదు. దాంతో శాంతి.. ఆమె తల్లి, భర్త మృతదేహాలతో వారం రోజులుగా అదే ఇంట్లో ఉంటుంది.
శాంతి ఇంటి నుంచి దుర్వాసన రావడంతో దీని గురించి చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన పట్ల చుట్టుపక్కల వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ కాలంలో కూడా తిండి లేక ఇలా మరణాలు సంభవించడం విచారకరం అంటున్నారు. మరి ఈ దుర్ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.