మన సమాజంలో మహిళ పునర్వివాహం చేసుకోవడం అంత మాములు విషయం కాదు. మరీ ముఖ్యంగా బిడ్డలు ఉన్న మహిళ అయితే.. అసలు ఆలోచనే చేయదు. బిడ్డల బాగోగులు కోసం జీవితాన్ని త్యాగం చేస్తుంది. అలాంటి ఓ తల్లి రుణం తీర్చుకోవడం కోసం ఆమె కుమారులు ఎంత గొప్ప పని చేశారు అంటే..
సాధారణంగా తల్లి గురించి కుమార్తె ఎక్కువగా ఆలోచిస్తుంది. ఇద్దరూ స్త్రీలే కావడంతో.. తల్లి మనసును కుమార్తెనే బాగా అర్థం చేసుకుంటుంది. ఒంటరి తల్లి విషయంలో ఈ ఆలోచన, బాధ్యత మరి కాస్త ఎక్కువగా ఉంటుంది. తండ్రి పోయిన దగ్గర నుంచి తమ కోసమే జీవితాన్ని ధారబోసి తల్లిని బాగా చూసుకోవాలని.. కనీసం తాము జీవితంలో స్థిరపడ్డాక అయినా.. తల్లికి మంచి జీవితం ఇవ్వాలని భావిస్తారు. తండ్రి పోయిన దగ్గర నుంచి బిడ్డలే లోకంగా బతికిన ఆ తల్లి.. తాము వివాహం చేసుకుని వెళ్తే.. అమ్మ ఒంటరిది అవుతుదంని భావించి.. మలి వయసులో తల్లికి పెళ్లి చేసి.. అమ్మ రుణం తీర్చుకుంటున్నారు కొందరు కుమార్తెలు. అయితే తాజాగా ఈ జాబితాలో కుమారులు కూడా చేరుతున్నారు. మలి వయసులో తల్లికి ఓ తోడు చూసి.. ఆమెకు వివాహం చేసి.. అమ్మ పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
భర్తను కోల్పోయి.. బిడ్డల బాగోగుల కోసం తన జీవితాన్ని అంకితం చేసింది ఆ తల్లి. బిడ్డలను ఉన్నత సంస్కారవంతులుగా తీర్చిదిద్దింది. తమ కోసం జీవితాన్ని అంకితం చేసిన తల్లికి మలి వయసులో ఓ తోడు కావాలని భావించిన కుమారులు.. దగ్గరుండి తమ తల్లికి పెళ్లి చేసి గొప్ప మనసు చాటుకున్నారు. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. కల్లకురిచి జిల్లా వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి అనే మహిళకు ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కొడుకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్. వీరి చిన్నతంలోనే అనగా సుమారు 13 ఏళ్ల క్రితం (2009) తండ్రి చనిపోయాడు.
అప్పటి నుంచి తల్లే వారి బాధ్యతలను తన భుజాల మీద వేసుకుని.. కుమారుల బాగోగులు చూసుకుంది. బిడ్డలే లోకంగా బతికింది. ఇలా ఉండగా.. సెల్వి పెద్ద కుమారుడు భాస్కర్ డిగ్రీ మూడో ఏడాది చదువుతున్నప్పుడు.. అతడి క్లాస్ టీచర్ ఒకరు.. మీ అమ్మకు పెళ్లి చేయవచ్చు కదా అని సూచించింది. అయితే ఆ సమయంలో టీచర్ అన్న మాటలు భాస్కర్ జీర్ణించుకోలేకపోయాడు.. ఆమె మీద మండిపడ్డాడు. ఆ తర్వాత భాస్కర్ కాలేజీ చదువు ముగించుకుని, ఉద్యోగంలో చేరిపోయాడు. భాస్కర్‌కు పుస్తకాలు చదివే అలవాటు ఉంది. మరీ ముఖ్యంగా ప్రముఖ తమిళ రచయిత పెరియార్ రాసిన పుస్తకాలు విపరీతంగా చదివేవాడు.
పెరియార్ తన రచనల్లో.. వితంతు పునర్వివాహాల అవసరం గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు. ఆ రచనలు భాస్కర్ మీద ప్రభావం చూపాయి. సరిగా ఇదే సమయంలో డిగ్రీ చదువుతుండగా టీచర్ తన తల్లి పునర్వివాహం గురించి మాట్లాడిన మాటలు భాస్కర్ మదిలో మెదిలాయి. తన అభిమాన రచయిత రచనలను ఎంతో మెచ్చుకుంటున్నాడు.. చాలా బాగా చెప్పాడు అని ప్రశంసిస్తున్నాడు. మరి వాస్తవంగా తన ఇంట్లో కూడా భర్తను కోల్పోయి మోడుగా బతుకున్న తల్లి ఉంది కదా. మరి తన తల్లి మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోకూడదు అని ఆలోచించసాగాడు భాస్కర్. తన ఆలోచన గురించి తమ్ముడు వివేక్‌తో చర్చించాడు. తను కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి తమ నిర్ణయాన్ని తల్లికి తెలిపారు.
కుమారుల ఆలోచన విన్న తల్లి వారి గొప్ప మనసుకు మురిసిపోయింది. తన పెంపకంలో ఎలాంటి లోపం లేదని అర్థం అయిన వేళ.. ఆ తల్లి ఎంతో సంతోషించింది. కానీ సమాజం గురించి ఆలోచించి.. కుమారుల నిర్ణయానికి నో చెప్పింది. అయితే భాస్కర్ అంతటితో వదిలేయలేదు. ఒంటరిగా జీవితం గడుపుతున్న తల్లి మళ్లీ పెళ్లి చేసుకుంటేనే.. తాము వివాహం చేసుకుంటామని.. లేదంటే అలానే ఉంటామని తెలిపారు. అయినా తల్లి అంగీకరించలేదు. ఇటు కుమారులు తమ ప్రయత్నాన్ని విరమించలేదు. ప్రతి రోజూ ఇదే విషయమై కొడుకులు తనను బతిమిలాడసాగారు. మెల్లిగా సెల్వి ఆలోచనల్లో మార్పు రాసాగింది.
తాను వివాహం చేసుకోవడం వల్ల తనలాంటి ఎందరో మహిళలకు ఉదాహరణ ఉండగలవని తల్లికి చెప్పారు. అంతేకాక భర్తను కోల్పోయి.. తాము కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని బంధువులకు తమ కుటుంబ నిర్ణయాల గురించి మాట్లాడే హక్కు లేదని.. వారి గురించి పట్టించుకోవద్దని తల్లికి ధైర్యం చెప్పారు. మలి వయసులో ఆమెకు ఓ తోడు కావాలని అర్థం అయ్యేలా వివరించారు. కుమారులు మాటలు సెల్విపై ప్రభావం చూపసాగాయి. తన భర్త చనిపోయినప్పుడు ఇంట్లో మరుగుదొడ్డి సదుపాయం కూడా లేదు. తాను రాత్రి పూట బయటికి వెళ్తుంటే ఈ సమయంలో ఎక్కడికి వెళ్తున్నావంటూ ప్రశ్నించి.. ఎగతాళి చేసిన సంఘటనలు గుర్తు చేసుకుంది.
అంతేకాక భర్త లేకుండా ఒంటరిగా బతుకుతుండటంతో ఎంతోమంది తనతో సంబంధం పెట్టుకోవడానికి ప్రయత్నించారు తప్పితే తనను వివాహం చేసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. వీటన్నింటిని గుర్తు చేసుకున్న సెల్వి కేవలం ఒంటరి మహిళలు మాత్రమే ఎందుకు ఇలాంటి సమస్యలు ఎదుర్కొవాలని భావించింది. ఇన్ని రోజులు బిడ్డల కోసం బతికింది. నేడు అదే పిల్లలు తన భవిష్యత్తు గురించి ఆలోచించి ఓ మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు తాను ఎందుకు వద్దు అనాలని ప్రశ్నించుకుంది. తన వివాహం ఎందరో ఒంటరి మహిళలకు స్ఫూర్తిగా నిలివడమే కాక.. తన కుమారులు ఎందరికో ఆదర్శంగా నిలుస్తారని భావించింది సెల్వి. ఎట్టకేలకు రెండో వివాహానికి అంగీకారం తెలిపింది.
తల్లి నుంచి అనుమతి పొందిన తర్వాత కొడుకులు యేలుమలై అనే ఓ రైతు కూలీతో సెల్వి వివాహం జరిపించారు. ఐతే సెల్వి పునఃవివాహానికి బంధువులు ఎవ్వరూ హాజరుకాలేదు. తమ తల్లి సంతోషమే తమకు ముఖ్యమని.. ఎవరి గురించి పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు సెల్వి కుమారు. మరి తల్లి కోసం ఈ బిడ్డలు చేసిన మంచి పనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.