సోమవారం మంత్రి కుమార్తె జయ కల్యాణి తనకు రక్షణ కావాలంటూ పోలీసులను ఆశ్రయించారు. తమిళనాడు మంత్రి శేఖర్ బాబు కుమార్తె పెద్దలను కాదని ప్రేమించిన యువకుడు సతీష్ ను హిందూ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత నేరుగా బెంగళూరు సిటీ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి తమకు రక్షణ కావాలని కోరారు. తన తండ్రి నుంచి ప్రాణ హాని ఉందని జయ కల్యాణి ఫిర్యాదు చేశారు.
తమ ప్రేమ పెళ్లికి పెద్దలు అడ్డు చెప్పారని తెలిపారు. తమకు రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. ఆ తర్వాత మీడియాతోనూ వివరాలు వెల్లడించారు. ‘నేను నా భర్త సతీష్ చాలా ఏళ్లుగా ఒకరినొకరం ప్రేమించుకుంటున్నాం. ఈ రోజు మా వివాహం జరిగింది. మా పెద్దలు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు. గతంలో నన్ను పెళ్లి చేసుకునేందుకు సతీష్ ముందుకు వచ్చారు. ఆ సమయంలో తమిళనాడు పోలీసులు అతడిని రెండు నెలలు నిర్భందించారు. దాని వెనుక మా నాన్న పాత్ర ఉందని అనుమానంగా ఉంది. మేము మేజర్లం.. మా పెళ్లి మా సమ్మతితోనే జరిగింది. మేం తమిళనాడులో అడుగుపెడితే చంపేస్తామని మమ్మల్ని బెదిరించారు. అందుకే పోలీస్ ప్రొటెక్షన్ కోరాం’ అంటూ జయ కల్యాణి తెలిపారు.
ఈ వివాహం చేయించిన హిందూ కార్యకర్త భరత్ శెట్టి కూడా వారి వివాహంపై స్పందించారు. ‘వీళ్లు వివాహం చేసుకోవడానికి సోషల్ మీడియా ద్వారా నన్ను సంప్రదించారు. మేము హింతూ సంప్రదాయంలో వివాహం జరిపించాం. ఈ జంటకు అమ్మాయి తరఫు వారి నుంచి ప్రాణ హాని ఉంది. ఆ కారణంగానే వారు బెంగళూరు పోలీసుల రక్షణ కోరుతున్నారు’ అంటూ భరత్ శెట్టి తెలియజేశారు. తమిళనాడు మంత్రి శేఖర్ బాబు ముఖ్యమంత్రి స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో ఈ పెళ్లి వ్యవహారం ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.