చనిపోయిన మనిషి.. తిరిగి బతకడం సాధ్యామా.. అంటే వైద్యులతో పాటు సామాన్యులు కూడా కాదనే అంటారు. కానీ కొన్ని సార్లు చిత్రవిచిత్ర సంఘటనలు చోటు చేసుకుని.. మన నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తాయి. చనిపోయాడని.. భావించి.. అంత్యక్రియలకు సిద్ధమైన వేళ.. లేచిన వారు ఎందరో ఉన్నారు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఓ వ్యక్తి మరణించాడు. ఇక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో దింపుడు కళ్లెం దగ్గర.. ఆగి.. పాడె మీద ఉన్న మృతదేహం నోట్లో పాలు పోయగా.. వెంటనే శవం లేచి కూర్చుంది. అది చూసి అంత్యక్రియలకు వచ్చిన వారు షాకయ్యారు. ఈ వింత సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది.
ఈ సంఘటన తమిళనాడులోని పుదుకోట జిల్లా, ఆలంపట్టి మురండాంపట్టి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన 60 ఏళ్ల రైతు షణ్ముగం.. గుండె, లివర్ సమస్యలతో కొన్ని రోజులుగా ఇబ్బంది పడుతున్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం షణ్ముగం పరిస్థితి విషమించింది. దాంతో.. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని పొన్నమరావతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అతడి పరిస్థితి విషమించడంతో.. వైద్యులు లాభం లేదని చెప్పారు. దాంతో కుటుంబ సభ్యులు షణ్ముగాన్ని ఇంటికి తీసుకుని వచ్చారు. ఇంతలో అతడిలో పూర్తిగా చలనం లేదు. దాంతో షణ్ముగం కుటుంబ సభ్యులు అతడు చనిపోయాడని భావించి.. బంధువులకు సమాచారం ఇచ్చారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
ఇక షణ్ముగం చనిపోయాడని చెప్పడంతో.. బంధువులు అతడి ఇంటికి వచ్చి.. కుటుంబ సభ్యులను ఓదార్చడం ప్రారంభించారు. అంత్యక్రియలకు ఏమేం చెయ్యాలో అవన్నీ చేస్తూ కుటుంబ సభ్యులు ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. ఆ తర్వాత షణ్ముగం మృతదేహాన్ని ఇంటిబయట తిన్నెపై కూర్చోబెట్టారు. ఇక వారి ఆచారం ప్రకారం షణ్ముగం కొడుకు చివరిసారిగా తండ్రి నోట్లో పాలుపోశాడు. ఆ పాలు నోట్లోకి వెళ్లీ వెళ్లగానే.. ఒక్కసారిగా దగ్గుతూ షణ్ముగం కళ్లు తెరిచాడు. ఈ సంఘటనతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా భయంతో బిగుసుకుపోయారు. అందరూ తనవైపు ఆదోలా చూస్తుంటే.. ఏమైంది ఎందుకు ఇంత మంది వచ్చారు అని కంగారుగా అడిగాడు షణ్ముగం.
ఇక ఈ సంఘటన చూసి షణ్ముగం కుటుంబ సభ్యులు.. ఓవైపు ఆశ్చర్యం, మరోవైపు ఆనందం రెండు ఒకేసారి అనుభవించారు. ఆ తర్వాత తేరుకుని.. చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరిగి బతికినందకు అందరూ సంతోషించారు. ఇక వచ్చిన బంధువులు అతడిని పరమార్శించి వెళ్లిపోయారు. అయితే ఇంతకు షణ్ముగం నిజంగానే చనిపోయి బతికాడా.. లేక కుటుంబ సభ్యులు పొరపాటున అతడు చనిపోయాడని భావించారా అనేది తెలియాల్సి ఉంది. ప్రసుత్తం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.