దేశవ్యాప్తంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. దీనికి తోడు గత కొంత కాలంగా వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి.. వేసిన పంటలు నీటిపాలయ్యాయి. ఈ కారణంగా విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులు నానా అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి టమాట ధరలు చుక్కలనంటాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది.
కేవలం టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి. ఇక చెన్నైలో టమాట ధరలు రూ.150 కి పెరిగాయి. ఈ నేపథ్యంలో టమాటా ధరల కట్టడికి ప్రభుత్వం విస్తృత చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సహకార శాఖ పరిధిలోని దుకాణాల్లో కిలో రూ. 79కి విక్రయించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలోని మార్కెట్లలో కిలో రూ. 130 నుంచి రూ. 150 వరకు పలుకుతోంది.
వర్షాల కారణంగా దిగుమతి తగ్గడంతో టమాట కొరత ఏర్పడటం.. ధరలకు రెక్కలు రావడం జరిగింది. అయితే ధరలు మరింత పెరగొచ్చన్న సంకేతాలతో మహారాష్ట్ర నుంచి టమాటాలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొన్ని రోజులుగా తమిళనాడులో వరుణ దేవుడు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో సహకారశాఖ పరిధిలో తోట పచ్చధనం దుకాణాల ద్వారా బుధవారం నుంచి కిలో రూ. 79కి విక్రయాలు ప్రారంభించింది. చెన్నైలో 40, ఇతర ప్రాంతాల్లోని మరో 65 దుకాణాల్లో విక్రయాలు సాగుతున్నాయి. ప్రజల మేలు కోసం సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.