గత రెండు నెలలుగా మణిపూర్‌లో హింసాత్మక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న దుండగులపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది.
మణిపూర్‌లో గత రెండు నెలలుగా హింసాత్మక చర్యలు కొనసాగుతున్నాయి. ఇటీవల మహిళలపై జరిగిన అకృత్యాలను చూసి దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మహిళలకు భద్రత లేకుండా పోతుంది. భరతమాత అని కొలిచే దేశంలో ఆడవారికి పట్టిన దుస్థితిని చూసి ప్రపంచం అంతా కన్నీరు పెడుతుంది. ఈ ఘటన మరువక ముందే బెంగాల్‌లో కూడా అదే తరహాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఈ దారుణ ఘటనపై బెంగాల్ మహిళా ఎంపీ వెక్కివెక్కి ఏడ్చారు. ఇలా జరుగుతున్న అత్యాచారాలపై రాజస్థాన్‌లో ఓ మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై ఆరా తీశారు. దీంతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గంటల్లోనే ఆయనను మంత్రి పదవి నుండి తొలగించారు. పూర్తి వివరాల్లోకి వెళితే…
మణిపూర్‌లో ఇటీవల ముగ్గురి మహిళలపై జరిగిన అకృత్యాలు, అత్యాచారాలపై దేశం మొత్తం మణిపూర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా రాజస్థాన్‌లో మంత్రి రాజేంద్ర సింగ్ గుధా అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. రాజస్థాన్‌లో మహిళలపై జరుగుతున్న నేరాల కట్టడికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. మహిళలకు భద్రత కల్పించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతోందని.. మణిపూర్ అంశంపై దృష్టిసారించే ప్రభుత్వం ముందుగా రాష్ట్ర పరిస్థితులను సరిచూసుకోవాలని మంత్రి రాజేంద్ర సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపాయి.
రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ఈ మాటలను తీవ్రంగా పరిగణించారు. రాజేంద్ర సింగ్ గుధాను మంత్రి వర్గం నుండి వెంటనే తొలగిస్తున్నట్లు రాజ్ భవన్‌కు సిఫార్సు పంపారు. గవర్నర్ కల్‌రాజ్ మిశ్రా దానికి ఆమోదం తెలిపారు. గంట సమయంలోనే ఈ పరిణామాలు చాలా త్వరగా జరిగిపోయాయి. గతంలో ప్రధాన మంత్రి.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్,ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో శాంతిభద్రతలు ఘోరంగా దెబ్బతిన్నాయని, ఆడవారిపై అకృత్యాలు పెరిగిపోయాయని ఆవేదన చెందారు. ఇదిలా ఉండగా గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖల మంత్రిగా ఉన్న రాజేంద్ర సింగ్ గుధా వ్యాఖ్యలు కూడా తీవ్ర సంచలనం కలిగించాయి. దీంతో రాజేంద్ర సింగ్‌ను మంత్రి పదవి నుండి తొలగించారు.